బస్టాండ్ దగ్గర నిల్చున్న భార్య ముఖంపై ఉమ్మేసిన భర్త.. రెండు రోజుల తర్వాత ఏమైందంటే..

బస్టాండ్ దగ్గర నిల్చున్న భార్య ముఖంపై ఉమ్మేసిన భర్త.. రెండు రోజుల తర్వాత ఏమైందంటే..

చిక్కబళ్లాపుర: అదనపు కట్నం వేధింపులతో విసిగిపోయిన మహిళా లెక్చరర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలో విషాదం నింపింది. ఈ ఘటన దొడ్డబళ్లాపుర తాలూకాలోని ఘాటి సమీపంలోని విశ్వేశ్వరయ్య పికప్ డ్యామ్ దగ్గర జరిగింది. దొడ్డబళ్లాపూర్లోని సోతెనహళ్లికి చెందిన పుష్పవతి (23) ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులకు నలుగురు కూతుర్లు. ఆమె నాలుగో కూతురు. 2024 నవంబర్‌లో దొడ్డబళ్లాపూర్లోని తపసిహళ్లి గ్రామానికి చెందిన వేణుకు, పుష్పకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి కూడా అట్టహాసంగా చేశారు.

పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే వేణు దుర్భుద్ది బయటపడింది. భార్యతో వేణు కాపురం చేసేందుకు ఆసక్తి చూపించేవాడు కాదు. డాక్టర్లు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరు మారలేదు. పుష్పవతి అత్త భారతి, మామ గోవిందప్పకు తమ కొడుకు తీరు గురించి పుష్పవతి చెప్పినా వాళ్లు కూడా అతనికే మద్దతు పలికారు. తన కొడుకుకు దొడ్డబళ్లాపురలో స్థలం ఇస్తేనే కాపురం చేస్తాడని తేల్చి చెప్పారు. నెల రోజుల క్రితం జరిగిన గొడవలో పుష్పవతిపై వేణుతో సహా అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఆ తర్వాత పుష్పవతి ఈ విషయాన్ని పుట్టింట్లో చెప్పి.. దొడ్డబళ్లాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. 

భార్య ఫిర్యాదుతో అవమానంతో రగిలిపోయిన వేణు, అతని కుటుంబం పుష్పవతిని నలుగురిలో అవమానించాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగానికి వెళ్తున్న పుష్పవతిని దొడ్డబళ్లాపూర్‌లోని డి-క్రాస్ బస్టాండ్ దగ్గర ఆపి, ఆమె ముఖంపై వేణు ఉమ్మివేశాడు. ‘నువ్వు నాపై, నా కుటుంబంపై పోలీసులకు కంప్లైంట్ చేస్తావా ? మళ్ళీ పెళ్లి చేసుకుని నేనేంటో చూపిస్తాను’ అని వేణు బెదిరించాడు. పుష్పవతి ఈ విషయం గురించి తన పుట్టింట్లో చెప్పుకుని బాధపడింది. మరుసటి రోజు.. ఆమె ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లింది. కానీ.. ఇంటికి తిరిగి రాలేదు. రెండు రోజుల తర్వాత, ఆమె మృతదేహం దొడ్డబళ్లాపూర్ ఘాటి సమీపంలోని విశ్వేశ్వరయ్య పికప్ డ్యామ్‌లో దొరికింది.

శనివారం ఉదయం కాలేజ్కు వెళ్లిన తమ కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో పుష్పవతి కుటుంబం దొడ్డబళ్లాపూర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేయగా, ఆమె మొబైల్ ఫోన్ డ్యాం దగ్గర ఉందని గుర్తించారు. ఆమె మృతదేహం కూడా అక్కడే లభ్యమైంది. ఆమె మొబైల్ ఫోన్‌లోని సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. వేణు, అతని మామ గోవిందప్పన్‌ను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.