
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో హైదరాబాద్ లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నామినేషన్లకు ఇవాళే ( అక్టోబర్ 21 ) చివరి రోజు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు రిటర్నింగ్ ఆఫీసర్. చివరిరోజు కావడంతో ఇవాళ భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ అబ్యర్థి నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా.. బీఆర్ఎస్ నుంచి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు మాగంటి సునీత. మరో బీఆర్ఎస్ అభ్యర్థి విష్ణు రెడ్డి డమ్మి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలు చేశారు దీపక్ రెడ్డి భార్య. దీపక్ రెడ్డి ఇవాళ మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బుధవారం ( అక్టోబర్ 21 ) నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు అధికారులు. శుక్రవారం ( అక్టోబర్ 24 ) వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణపై ఎన్నికల సంఘం (ఈసీఐ) నిషేధం విధించింది. నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6.30 వరకు ఈ నిషే ధం అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను ఎగ్జిట్ పోల్స్ ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మార్గర్శకాలు జారీ చేసిందన్నారు.
న్యూస్ పేపర్లు, టీవీలు, రెడీయో, పత్రికలు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌కు, ప్రచార మాద్యమాలకు ఈ నిషేధం వర్తిస్తుందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ప్రజాప్రతినిధుల చట్టం, 1951 ప్రకారం రెండేండ్ల జైలు శిక్ష, జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉందన్నారు.