ఉద్యోగాల పేరుతో.. రూ.రెండు కోట్ల మోసం

ఉద్యోగాల పేరుతో.. రూ.రెండు కోట్ల మోసం

 

  •     రైలు కింద పడి నిరుద్యోగి సూసైడ్
  •     మిర్యాలగూడలోని ఈదులగూడలో విషాదం 
  •     ప్రభుత్వ లెక్చరరే ప్రధాన సూత్రధారి 
  •     సహకరించిన ఎస్టీబీసీ చైర్మన్​, మరో వ్యక్తి 
  •     37 మంది నుంచి రూ.2 కోట్లకు  పైగా వసూళ్లు

మిర్యాలగూడ, వెలుగు : జాబ్స్​ ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసి మోసం చేయడంతో మిర్యాలగూడలోని ఈదులగూడకు చెందిన ఓ నిరుద్యోగి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా, మోసంలో ఐదేండ్ల కింద మిర్యాలగూడలో పని చేసిన ఓ ప్రభుత్వ జూనియర్​ కాలేజీ లెక్చరర్​ ప్రధాన పోత్ర పోషించాడు. ఇతడికి ఎస్టీబీసీ సంస్థ చైర్మన్​, మరో వ్యక్తి సహకరించారు. తాజాగా యువకుడి ఆత్మహత్యతో వీరి అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మిర్యాలగూడకు చెందిన ఉమ్మడి వెంకట్​రెడ్డి 2017లో నాగార్జున ఇంటర్మీడియట్​ఎయిడెడ్​ కాలేజీలో ఇంగ్లిష్​  లెక్చరర్​ (ప్రస్తుతం మెదక్ ​జిల్లా కేంద్రంలో పని చేస్తున్నాడు) ​గా పని చేశాడు. ఇదే టైంలో ఇతడు తన సమీప బంధువైన బజనూరి వేంకటేశ్వర్​రెడ్డి(28)ని కలిసి ఏపీలోని కర్నూల్​ఎయిడెడ్​ కాలేజీలో ల్యాబ్ ​అసిస్టెంట్​ జాబ్ ​ఇప్పిస్తానని రూ. 5 లక్షలు తీసుకున్నాడు. రెండు నెలల తర్వాత ఆర్డర్​ కాపీ ఇచ్చాడు. కొద్ది రోజులకే  అక్కడి అక్కడి కాలేజీలో సమస్యలున్నాయని, రిక్రూట్​మెంట్​ టెంపరరీగా ఆపేశారని నమ్మించాడు. వెంకట్​రెడ్డితో పాటు ఎస్టీబీసీ(సమావేశం ఆఫ్​ తెలుగు బాప్టిస్ట్​ చర్చ్​) చైర్మన్​ అంజన్ ప్రసాద్,​ మరో మీడియేటర్​ విజయరామరాజు కూడా వేంకటేశ్వర్​రెడ్డికి తప్పకుండా ఉద్యోగం వస్తుందని నమ్మించారు.

వెంకట్​రెడ్డి, అంజన్​ప్రసాద్​, విజయరామరాజు కలిసి ఎస్టీబీసీ సంస్థ ద్వారా ఎపీలోని పలు ఎయిడెడ్​ కాలేజీల్లో లెక్చరర్, లైబ్రేరియన్​, ఇతర పోస్టింగుల పేరిట మిర్యాలగూడకు చెందిన సుమారు 25  మంది నుంచి రూ. 1.60 కోట్లు వసూలు చేశారు. కోదాడ ప్రాంతానికి చెందిన 11 మంది నుంచి  రూ. 60  లక్షలు తీసుకున్నారు. ఇందులో మోసపోయిన కొంతమంది ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న వెంకట్​రెడ్డిని కలిసిన వేంకటేశ్వర్​రెడ్డి తన డబ్బులు ఇవ్వాలని కోరగా, ఇప్పట్లో కావని చెప్పాడు. దీంతో కలత చెంది 22న దామరచర్ల మండలం కొండ్రపోల్​వద్ద గూడ్సు రైలు కింద పడి సూసైడ్​ చేసుకున్నాడు.  తన కొడుకు 2011 నుంచి నుంచి జాబ్ ​కోసం తిరుగుతున్నాడని, ఎక్కడా ఉద్యోగాలు లేక వెంకట్​రెడ్డిని నమ్మాడని  వేంకటేశ్వర్​రెడ్డి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి డబ్బులు ఇచ్చానని, అవి తిరిగి రాక, జాబ్​ లేక ఆత్మహత్య చేసుకున్నాడని విలపించాడు. బాధ్యులపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని మృతుడి తల్లి కౌసల్య, సోదరుడు జగదీశ్​రెడ్డి  డిమాండ్​ చేశారు.  దీనిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.