ఫేక్​ ఐటీ కంపెనీతో మహారాష్ట్రలో మోసం

ఫేక్​ ఐటీ కంపెనీతో మహారాష్ట్రలో మోసం

నాగ్​పూర్: వాళ్లు ముగ్గురూ చదివింది పదో తరగతే..  కానీ,  ఏకంగా  ఓ ఫేక్  ఐటీ కంపెనీనే స్టార్ట్ చేశారు. కంపెనీ కాంటాక్ట్ వివరాలను గూగుల్​లో లిస్ట్ చేశారు. ఫోన్ పే యాప్​లో సమస్యతో కాల్ చేసిన  ఓ యువకుడి ఖాతాలో నుంచి రూ.5 లక్షలు కాజేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మహారాష్ట్రకు చెందిన అతుల్ ఇంద్రపాటి సింగ్ (32), నీరజ్ శామ్ కుమార్ చౌబే (26), వికాస్  మేఘ్ లాల్ సా(23).. సమర్థ్  ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఇటీవలే కంపెనీ పెట్టారు. దాని కాంటాక్ట్   వివరాలను గూగుల్​లో లిస్ట్  చేశారు. ఈ క్రమంలో  నాగ్​పూర్​కు చెందిన అతుల్  యూకే ఫోన్ పే యాప్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో అతను గూగుల్​లో వెతకగా.. సమర్థ్  ఐటీ సొల్యూషన్స్  కాంటాక్ట్  వివరాలు కనిపించాయి. ఆ కంపెనీకి అతుల్  ఫోన్  చేసి తన సమస్య గురించి చెప్పాడు. అవతలి వ్యక్తులు వీడియో కాల్ చేయాలని చెప్పడంతో అతుల్ అలాగే చేశాడు. ఇంతలోనే సైబర్  కేటుగాళ్లు అతుల్  ఫోన్  సెట్టింగ్స్ మార్చారు. రాత్రికల్లా సమస్య తీరిపోతుందని, యాప్ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో అతుల్ బ్యాంకు ఖాతాలోంచి మూడు దఫాలుగా రూ.4.5 లక్షలు బదిలీ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఆదివారం ఆ ముగ్గురు మోసగాళ్లను ముంబైలో అరెస్టు చేశారు.