హలో… జాబ్ కావాలా?

హలో… జాబ్ కావాలా?

   ఐటీ జాబ్‌కు    సెలెక్టయ్యారంటూ ఫోన్‌ కాల్స్‌

   నిరుద్యోగులను దోచుకుంటున్న ఫేక్‌ కంపెనీలు

    పట్టించుకోని రాష్ట్ర సర్కారు

‘హాయ్‌ మిస్టర్‌ రమేశ్​.. దిస్‌ ఈజ్‌ నర్మదా దేవ్.. హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఫ్రం ఎక్స్‌ ఐటీ కంపెనీ. హౌ ఆర్‌ యూ యంగ్‌మ్యాన్‌’ అంటూ తియ్యటి స్వరంతో రమేశ్​ మైమరిచి పోయేలా మాట్లాడింది. ‘మీరు పంపిన రెజ్యూమ్‌ చూశాం. మీ క్వాలిఫికేషన్‌, స్కిల్స్‌ నచ్చాయి. మీకు జాబ్‌ కన్‌ఫమ్‌’ అంటూ ఊరించింది. వివరాల తర్వాత రకరకాల ఫీజుల గురించి చెప్పింది. ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టించుకున్నాక ఓ రోజు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్​ వచ్చింది. ఎంక్వయిరీ చేస్తే చెప్పిన అడ్రస్‌లో అలాంటి వాళ్లు ఎవరూ లేరని తేలింది. ఇలా సిటీలో చాలామంది మోసపోతున్నారు. నిరుద్యోగులైన యువతీ యువకులను టార్గెట్​ చేస్తూ దోచుకుంటున్నారు ఫేక్​గాళ్లు. కొంతమంది బయటపడితే..మరికొందరు లోలోపలే మదనపడుతున్నారు. ఫేక్​ కంపెనీలను నిలువరించడంలో మహారాష్ట్ర  ముందుండగా మన స్టేట్‌ పట్టించుకోవడం లేదు. గతేడాది  భారీ ప్యాకేజ్ ఇస్తామని నమ్మించిన రెండు కంపెనీలు 400 మందిని పని చేయించుకుని  పైసా ఇవ్వకుండా గెంటేశాయి. పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనా బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్‌ జరుగుతూనే ఉన్నాయి.

ఐటీ కేంద్రమైన హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి. నిరుద్యోగులు, ఫ్రెషర్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగా ల పేరుతో నట్టేట ముంచే బురిడీ కంపెనీలు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నడిపిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగంపై మోజుతో నగరానికి వచ్చే యువతనే టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారంపై ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం ఫేక్ కంపెనీల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది . దీంతో ఐటీజాబ్ పై గంపెడాశలతో నగరానికి వచ్చే యువత నకిలీ కంపెనీల బుట్టలో ఈజీగా పడుతున్నారు.

గతేడాదిలో రెం డు కంపెనీలు భారీ ప్యాకేజ్ తో అవకాశాలు కల్పిస్తా మని ఎరవేసి ఏకంగా 400 మంది నిరుద్యోగులను మోసం చేసి జీతభత్యాలు చెల్లించకుండానే కంపెనీ మూసేసింది. ఈ సంఘటనపై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనా బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. సిటీలో చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు రెం టల్ వర్క్ స్టేషన్లు, అపార్టుమెం ట్లలో కార్యకలాపాలు చేసేవే ఎక్కువగా ఉండగా, వీటిలో 90 శాతం ఫేక్ కంపెనీలే ఉంటు న్నాయనేది నిపుణుల అభిప్రాయం. ఏదో ప్రాజెక్టు ఉందని అభ్యర్థు లను రిక్రూట్ చేసుకోవడం, వీలైతే డిపాజిట్ గా కొంత మొత్తం కట్టించుకోవడం పాటు, శిక్షణ ఇతర అంశాలంటూ కాలయాపన చేసి అభ్యర్థి తనకు తానే ఉద్యోగాన్ని వదిలిపోయేలా చేస్తుంటాయి ఈ తరహా కంపెనీలు. ఐటీ కార్యాకలపాలు కొనసాగించే సెజ్(Special EconomicZone) కారిడార్ లో గానీ, ఎస్టీపీఐ(Software Technology Parks of India)లో గానీ లేదా లేబర్ శాఖలో గాని రిజిస్టర్డ్ అయిన కంపెనీలను స్టాం డర్డ్ పరిగణించాల్సి ఉంటుంది .

వీటిల్లో నమోదైన కంపెనీలు నాలుగైదు దశల్లో జరిగే ఇంటర్వ్యూ ప్రక్రియ తర్వాతే ఉద్యోగంలోకి తీసుకుంటా యి. ఇలాంటి వాటిల్లో రెఫరెన్స్ విధానాన్ని కూడా కొన్ని కంపెనీలు అమలు చేస్తుంటాయి. ఇలా రెఫరెన్స్ చేసి రిక్రూట్ అయిన ప్రతిసారీ రెఫరర్ కు బోనస్ ను సాలరీతో కలిపి చెల్లిస్తా యి. అదే ఫేక్ కంపెనీలైతే అలాంటివేవీ లేకుండా కాలం గడిపేస్తుంటా యి. ముఖ్యంగా ఫ్రెషర్స్, ఈజీగా ఉద్యోగం దొరకాలనే యువతే ఆ కంపెనీలకు టార్గెట్ అవుతుంటారు.

 

మహారాష్ట్ర ఆదర్శం
నకిలీ ఐటీ కంపెనీల బారిన పడి మోసపోయే యువతీ, యువకులకు రక్షణగా నిలవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది . ఫేక్ కంపెనీల ఆగడాలకు చెక్ పెట్టేలా ఐటీ కంపెనీల ఉద్యోగులు, ఐటీ సంఘాలను భాగస్వామ్యం చేస్తూ అక్కడి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. దీని ద్వారా కంపెనీల రిజిస్ట్రేషన్, ప్రాజెక్టు వివరాలు, ఉద్యోగా ల భర్తీ ప్రక్రియ వంటి అంశాలను ఆ కమిటీ నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఈ తరహా విధానం హైదరాబాద్ లో లేకపోవడంతో ఫేక్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ చెలరేగిపోతున్నయి.