కేసీఆర్‌‌‌‌ను ఇంటికి పంపే టైమొచ్చింది : అమిత్‌‌ షా

కేసీఆర్‌‌‌‌ను ఇంటికి  పంపే టైమొచ్చింది : అమిత్‌‌ షా
  • బీఆర్‌‌ఎస్‌‌కు ఇక వీఆర్‌‌ఎస్సే: అమిత్‌‌ షా 
  • బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత అయోధ్య దర్శనం
  • ఇక్కడ కాంగ్రెస్​, బీఆర్‌‌‌‌ఎస్, మజ్లిస్ ఒక్కటయ్యాయని ఆరోపణ
  • మంచిర్యాల, పెద్దపల్లి, జమ్మికుంట రోడ్‌‌ షోలో కేంద్ర హోం మంత్రి

రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణలో సీఎం కేసీఆర్‌‌తో పాటు అవినీతికి పాల్పడిన అందరినీ కటకటాల్లో పెడ్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా కేంద్రాలతో పాటు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎంకు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్టేనని, ఈ మూడు పార్టీలను తెలంగాణలో లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. వరికి మద్దతు ధర రూ.3,100 ఇస్తామని చెప్పారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి భయపడి సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినాన్ని నిర్వహించడం లేదన్నారు. బీజేపీ సర్కార్ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ 2024 జనవరిలో అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట చేయనున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఆయనను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ రావు, లీడర్లు గొట్టిముక్కుల సురేష్​రెడ్డి, రావుల రాజేందర్, తంగెడ రాజేశ్వర్​రావు తదితరులు పాల్గొన్నారు.

సింగిరేణి కార్మికులకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తం.. 

తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఇన్​కమ్​ట్యాక్స్​రద్దు చేస్తామని అమిత్​షా హామీ ఇచ్చారు. మంచిర్యాలకు రాగానే ఇక్కడి సింగేణి కార్మికులు తనకు ఘన స్వాగతం పలికారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​, బీఆర్‌‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిచిన వెంటనే కేసీఆర్ వారిని​కొన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వారు మళ్లీ ఆయన దగ్గరకే వెళ్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కేసీఆర్‌‌ను సీఎం, రాహుల్‌ను పీఎం చేస్తారన్నారు. ఇక్కడ కేసీఆర్, రాహుల్‌ ప్రభుత్వం కాదు, బీజేపీ సర్కారే వస్తుందన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి బీసీలకు ఇస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చి కారును గ్యారేజీకి పంపాల్సిన టైమొచ్చిందన్నారు. మంచిర్యాలలో వెరబెల్లి రఘునాథ్ రావును ‌ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.