- మహిళలకు నెలకు రూ.2 వేలు
- అర్హులందరికీ అమ్మ హౌసింగ్ స్కీమ్
- అర్బన్ ఏరియాల్లో అపార్ట్మెంట్లు కట్టి పేదలకు ఇండ్లు
- పెండ్లయి వేరు కాపురం పెట్టినోళ్లకు ల్యాండ్ సమకూర్చి సొంతిల్లు
- ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరిన్ని హామీలు ఉంటాయన్న పళనిస్వామి
చెన్నై: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి ఐదు కీలక హామీలను ప్రకటించారు. శనివారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో ఎంజీఆర్ ఫొటోకు పళనిస్వామి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘‘సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు అమలు చేస్తున్నట్లే పురుషులకూ ఫ్రీబస్ జర్నీ సౌకర్యం కల్పిస్తాం. ఫ్యామిలీ కార్డ్ ఉన్న మహిళలకు నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తాం. అలాగే, అమ్మ హౌసింగ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేనివారికి కాంక్రీట్ ఇండ్లు కట్టిస్తాం. భూమి లేకపోతే ప్రభుత్వమే భూమి కేటాయిస్తుంది. అర్బన్ ఏరియాల్లో అపార్ట్మెంట్లు కట్టి ఇండ్లు లేనివారికి ఇస్తాం” అని పళనిస్వామి వివరించారు.
ఉపాధి హామీ పథకం 150 రోజులకు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని తాము 150 రోజులకు పెంచుతామని పళనిస్వామి వెల్లడించారు. అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మంది మహిళలకు రూ.25 వేల సబ్సిడీతో టూ వీలర్లు ఇస్తామని చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు రూ.1500 ఇస్తామని తాము హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.500కు పెంచుతున్నామని పేర్కొన్నారు.
దీనితోపాటు ఏడాదికి ఆరు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు. కాగా.. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఈలోపే పళనిస్వామి హామీలు ఇచ్చేశారు. అంతేకాకుండా మేనిఫెస్టో కమిటీ రాష్ట్రవ్యాప్తంగా మీటింగ్లను పూర్తిచేసిన తర్వాత మరిన్ని హామీలు ఉంటాయని చెప్పారు.
