- లేకుంటే లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తాం
- తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ హెచ్చరిక
బషీర్బాగ్, వెలుగు: మహిళలకు ఉచిత ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమనుల్లా ఖాన్ చెప్పారు. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
బుధవారం హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహమ్మద్ అమనుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం మోటార్వెహికల్స్యాక్ట్కు వ్యతిరేకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలపై నిజంగా ప్రేమ ఉంటే, మద్యపాన నిషేధం అమలు చేయాలని సూచించారు. ఆటో డ్రైవర్ల మనుగడకు ప్రమాదకరంగా మారిన పథకాన్ని ఎత్తివేయకపోతే లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు మహమ్మద్ అజీమొద్దీన్, లక్ష్మీనర్సయ్య, ఎస్కే జామా, రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
