
దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు. కేవలం ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లోనే కాకుండా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను కేంద్రం ఉచితంగా అందజేస్తుందన్నారు. ఒడిశాలోని బాలసోర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని ఆయన అన్నారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి దాదాపు 500 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.
ఇక, బిహార్ ఎన్నికల సందర్భంగా.. బీజేపీ మేనిఫెస్టోలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇవ్వడం తీవ్ర దూమారానికి దారితీసింది. దేశవ్యాప్తంగా పలు పార్టీలు బీజేపీ హామీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి ఈ ప్రకటన చేశారు.