దేశంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నారు. ఒకనాడు ఉచితాలకు వ్యతిరేకమని చెప్పిన పార్టీలు కూడా ఎన్నికలలో విజయం కోసం తమ మేనిఫెస్టోలలో సంక్షే మ పథకాలకి పెద్దపీట వేస్తున్నారు. దేశంలో ఎక్కడ, ఏ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు మహిళా ఓట్లే లక్ష్యంగా మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కూడా రాజకీయ పార్టీలు పోటీపడి తమ ఎన్నికల మేనిఫెస్టోలలో మహిళా ఓట్లను, యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అనేక హామీలను ప్రకటించాయి. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 100 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వాఖ్యా
నాలు చేసింది. ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించటం ఎంత కాలం కొనసాగుతుంది? ఈ ధోరణి ఇలాగే కొనసాగితే దేశ దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోదా? ఈ దేశంలో అసలు ఏం జరుగుతోంది? ఉచితాలు ఎవరికి అవసరమో, ఎవరికి అనవసరమో లేదో చూడకుండా విచక్షణారహితంగా ప్రభుత్వం నిధులను పంచిపెట్టడం పూర్తిగా బుజ్జగింపు కిందికే వస్తుంది. అది దేశ ఆర్థిక అభివృద్ధికి మంచిది కాదని -సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
మహిళలకు నగదు బదిలి పథకాలు
ఇటీవల జరిగిన ఎన్నికలలో మహిళలను లక్షా ధికారులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలు మహిళలను కోటీశ్వరులను చేస్తామని వాగ్దానాలు చేస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు మహిళల ఖాతాలో నగదు జమ చేసే పథకాలను ప్రకటించి మహిళా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రారంభించిన మహిళలకి నగదు బదిలీ పథకం, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లాడ్లీ బెహన్, మహారాష్ట్ర ఎన్నికలలో లడ్కి బెహన్, జార్ఖండ్ ఎన్నికలలో సీఎం మయ్యా యోజన, కర్నాటక ఎన్నికలలో
గృహలక్ష్మి, తెలంగాణ ఎన్నికల్లో మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తల్లికి వందనం, బిహార్లో జీవిక దీదీ లాంటి పథకాలు ఆయా పార్టీలను ఎన్నికలల్లో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాయి. పశ్చిమ బెంగాల్లో లక్ష్మీ బండార్, తమిళనాడులో కలెంజర్ మంగలైర్ ఉరిమైతోగై లాంటి మహిళా పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా ఓటర్లలో ఇమేజ్ పెంచుకోగలిగాయి. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కూడా రాజకీయ పార్టీలు మహిళల ఖాతాలలో నెలకి నగదు జమ చేసే పథకాలను పోటీపడి ప్రకటించాయి. తమిళనాడులో డీఎంకే మహిళలకి నెలలకి రూ.2 వేలు ప్రకటిస్తే, అన్నాడీఎంకే రూ.3 వేలు ప్రకటించింది. బీజేపీ కూడా రూ.2వేలు ప్రకటిస్తే, విజయ్ సారథ్యంలోని టీవీకే మరొక అడుగు ముందుకేసి రూ. 2500 , పెండ్లి కూతురుకి 8 గ్రాముల బంగారం, పట్టుచీర అందజేస్తామని హామీ ఇచ్చి మహిళా ఓట్లకు గాలం వేస్తున్నారు. కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు మహిళలకి డిబిటి పద్ధతిలో నగదు బదిలీ చేసే పథకాలను ప్రకటించాయి.
యువతను ఆకర్షించే నిరుద్యోగ భృతి
మహిళల తర్వాత గెలుపు ఓటములను ప్రభావితం చేసే యువతరానికి కూడా రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా కోట్లాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని కీలకమైన హామీలను గుప్పిస్తున్నాయి. బెంగాల్ యువతకి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ, నిరుద్యోగ యువతకి నెలకి రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని తమిళనాడులో టీవికె పార్టీ హామీ ఇచ్చాయి. తెలంగాణలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ప్రకటించి అమలుచేయలేక చేతులెత్తేసింది. ఆకర్షణీయ పథకాలతో అయా వర్గాల ఓట్లను ఆకర్షించి తాత్కాలికంగా విజయం సాధించి అధికారంలోకి వచ్చేస్తామో కానీ, ఇలాంటి తాత్కాలిక ఉపశమనాలతో లక్ష్యాలను చేరుకోకపోగా పథకాల అమలు భారంగా మారి రాష్ట్రాలు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతాయి.
దేశాభివృద్ధికి హానికరం
ప్రభుత్వ రాయితీలను అర్హులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా పొందడం దేశాభివృద్ధికి హానికరమని బెంచ్ అభిప్రాయపడింది. అప్పుల భారంలోచిక్కుకున్న స్థితిలో ఉచితాలను ఏవిధంగా పంపిణీ చేస్తారనేది చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రజాస్వామ్యంలో ఒక పథకాన్ని ప్రకటించే ముందు దానికోసం నిధులు ఎలా సమకూర్చుతారనేది బడ్జెట్లో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఉచితాల భారం చివరకు పన్నులు చెల్లిస్తున్నవారిపై పడుతుందని, ఈ పరిస్థితి మారాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉచిత పథకాలను పంచిపెట్టడం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ ఉచిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయని ప్రశ్నించింది. తమిళనాడులో ఉన్నట్టుండి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటి అని అడిగింది. దీనివల్ల విద్యుత్ పంపిణీ కంపెనీలు డిస్కమ్‌లు నిధుల కొరతతో బడ్జెట్ లెక్కలకు తగ్గట్టు టారిఫ్ లను సవరించేందుకు ప్రయత్నించాల్సి వస్తుందని పేర్కొంది. రెవెన్యూ లోటు అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఉచితాలు ఎలా ప్రకటిస్తున్నాయంటూ బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థిక అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలు సైతం అదనంగా ఉన్న నిధులను రహదారుల అభివృద్ధికి, ఆసుపత్రులకు, స్కూళ్లకు ఉపయోగించవచ్చునని సూచించింది.
- ఉజ్జిని
రత్నాకర్ రావు
సీపీఐ సీనియర్ నాయకుడు

