ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏండ్ల పాటు ఉచిత ప్రయాణం

ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏండ్ల పాటు ఉచిత ప్రయాణం

12 ఏళ్లపాటు ఆఫర్

హైదరాబాద్, వెలుగు: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను స్వతంత్ర వజ్రోత్సవాలుగా పేర్కొంటూ 12 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆగస్టు 15న పుట్టిన పిల్లలు 12 ఏండ్ల పాటు ఉచిత ప్రయాణం కల్పించేలా కొత్త ఆఫర్​ను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 21 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావించిన సంస్థ.. అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండాలు ఎగురవేయడంతోపాటు ఉద్యోగులందరూ వజ్రోత్సవాల పేరిట తయారు చేసిన బ్యాడ్జీలను ధరించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఆదేశించారు.

32 మంది స్వాతంత్ర్య సమరయోధులను మననం చేసుకునేలా మూడు ప్రధాన బస్ స్టేషన్లు హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లో ఈనెల 15 నుంచి 20 వరకు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. సంస్థ ప్రాంగణాల్లో రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపన చేయడంతోపాటు 13న నెక్లెస్ రోడ్ లో పరేడ్ నిర్వహించాలని అధికారులు తీర్మానించారు. వాటితోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 

ప్రయాణికుల కోసం మరిన్ని సౌలతులు

  • 75 ఏళ్లు, ఆపై వయసుగల వృద్ధులు పంద్రాగస్టున ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే వారికి తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్​లో ఈనెల 15 నుంచి 22 వరకు ఉచిత హెల్త్​క్యాంప్​. 75 ఏండ్లలోపు వారికి రూ.750కే హెల్త్​ ప్యాకేజీ.  
  • 24 గంటల పాటు హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణించే వెసులుబాటు ఉన్న టికెట్ అసలు ధర రూ.120 ఉంటే వజ్రోత్సవాల సందర్భంగా దానిని రూ.75కే అందిస్తారు. 
  • తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్యాకేజీలు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆగస్టు 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు ఇస్తారు.
  • కిలో బరువుగల పార్సిల్​కు 75 కిలోమీటర్ల పరిధిలో 15న ఉచిత డెలివరీ.
  • తరచూ ఎక్కువ దూరం ప్రయాణించే 75 మందిని గుర్తించి వారికి మరో ట్రిప్​ ఫ్రీ.
     
  • 15న హైదరాబాద్ సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ కు నడిచే పుష్పక్ సర్వీస్ లో 25 శాతం రాయితీ.