పంద్రాగస్టుకు పిలిచి.. సీఎంను కలవనియ్యలే : ఫ్రీడమ్ ఫైటర్

పంద్రాగస్టుకు పిలిచి.. సీఎంను కలవనియ్యలే : ఫ్రీడమ్ ఫైటర్
మెహిదీపట్నం, వెలుగు : పంద్రాగస్టు వేడుకలకు ఆహ్వానించి సీఎంను  కలవనీయలేదని ఫ్రీడమ్ ఫైటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన పెంచల రాజలింగం (101) స్వాతంత్ర్యోద్యమంలో పోరాడారు. రాజలింగానికి పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేదు. దీంతో ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ వద్దకు వెళ్లగా.. ఆగస్టు15న గోల్కొండ కోటకు రమ్మని చెప్పి పంపించారు. రాజలింగం, తన ఇద్దరు కూతుళ్లు, మనవడితో కలిసి  మంగళవారం ఉదయం  కారులో గోల్కొండ కోటకు వచ్చాడు. అయితే, పోలీసులు కారును అడ్డుకున్నారు.

అప్పటికే సీఎం కేసీఆర్ కోటకు వచ్చారు. తమను లోపలికి పంపాలని రాజలింగంతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించ లేదు.చేసేదేమీ లేక  వారంతా మెయిన్​గేట్ వద్ద నిల్చుండిపోయారు.  రాజలింగం కూతుళ్లు నాగలక్ష్మి, ఇందిర మాట్లాడుతూ.. తన తండ్రికి పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేదని.. ఈ విషయమై సీఎంను కలిసేందుకు వినోద్ కుమార్  ఆహ్వానిస్తే వచ్చామన్నారు.    పోలీసులు అడ్డుకోవడంతో వీలుపడలేదని, క్యాంప్ ఆఫీసుకు వెళ్లి సీఎంను కలుస్తామని చెప్పారు.