
మణిపూర్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మణిపూర్ అల్లర్లలో భయానక సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన తర్వాత.. తాజాగా మరో అమానుష ఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచి ఓ ఫ్రీడమ్ ఫైటర్ భార్యను సజీవ దహనం చేసిన దారుణ ఘటన వార్త బయటికొచ్చింది. సాయుధులైన కొందరు స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి నిప్పటించారు.
మణిపూర్ లోని కక్చింగ్ జిల్లా సెరై గ్రామంలో సాయుధులైన అల్లరి మూకలు ఫ్రీడంఫైటర్ చురచంద్ సింగ్ భార్యను ఇంట్లో ఉంచి సజీవ దహనం చేసినట్లు సెరో పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ ఘటన మే 28న తెల్లవారు జామున జరిగినట్లు తెలుస్తోంది. అదే రోజు సెరో వంటి పలు ప్రాంతాల్లో భారీ హింస, కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. 80ఏళ్ల వయసులో మరణించిన చురచంద్ సింగ్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సన్మానించబడిన ఫ్రీడం ఫైటర్.
మణిపూర్ లో మే 3న రెండు ఆదివాసీ తెగల మధ్య తలెత్తిన వివాదం హింస దారి తీసిన విషయం తెలిసిందే.. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మెయిటీ, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణలతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఇండ్లు దహనం చేయబడ్డాయి. స్వాతంత్ర్య సమరయోధుడి భార్య 80 ఏళ్ల ఇబెటోంబి తన గ్రామంపై జరిగిన పుడు బయట నుండి తాళం వేసి ఉన్న ఇంటి లోపల ఉన్నారు. సాయుధులైన కొందరు ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. ఆమె కుటుంబం ఆమెను రక్షించడానికి వచ్చే సమయానికి మంటలు మొత్తం ఇంటిని చుట్టుముట్టాయని ఇబెటోంబి మనవడు ప్రేమకాంత మీడియాకు చెప్పారు.