నాలుగో రోజూ ఫ్రాన్స్ రణరంగం.. సిటీల్లో రాత్రిపూట రెచ్చిపోయిన నిరసనకారులు

నాలుగో రోజూ ఫ్రాన్స్ రణరంగం.. సిటీల్లో రాత్రిపూట రెచ్చిపోయిన నిరసనకారులు

నాలుగో రోజూ ఫ్రాన్స్ రణరంగం

పారిస్ : ఫ్రాన్స్ నగరాలు వరుసగా నాలుగో రోజు శనివారం కూడా రణరంగాన్ని తలపించాయి. రాజధాని పారిస్ సహా మార్సెల్లీ, లియోన్ వంటి ప్రధాన నగరాల రోడ్లన్నీ ఎటు చూసినా మంటలతో కనిపించాయి. రాత్రికిరాత్రే వేలాది వెహికల్స్ ను, షాపులను తగలబెట్టిన నిరసనకారులు పెద్ద ఎత్తున లూటీలకు పాల్పడ్డారు. ఒక్క శుక్రవారం రాత్రే దేశవ్యాప్తంగా1,311 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు.  రాత్రికిరాత్రి 1,350 వెహికల్స్ బూడిదయ్యాయి. 234 బిల్డింగ్ లకు కూడా నిప్పు పెట్టారు. పబ్లిక్ ప్లేస్ లలో మంటలు అంటించిన సంఘటనలు ఒక్కరాత్రే 2,560 జరిగాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 2,400 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం పారిస్ శివారులోని నాంటెర్రేలో ఆఫ్రికన్ సంతతికి చెందిన నహేల్ (17) అనే యువకుడిని ఓ పోలీస్ ఆఫీసర్ కాల్చిచంపడంతో ఆ మరునాటి నుంచి నిరసనలు మొదలయ్యాయి. విధ్వంసానికి పాల్పడుతున్న వాళ్లలో మూడొంతుల మంది టీనేజర్లు, యువకులే ఉన్నారని, వీరంతా టిక్ టాక్, స్నాప్ చాట్ వంటి యాప్ ల ద్వారా ఒకరిని చూసి ఒకరు అదే రకం దాడులు చేస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ వెల్లడించారు.

పిల్లలను కట్టడి చేయాలని, విధ్వంసం ఆగేందుకు సహకరించాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక దేశవ్యాప్తంగా హింసను కట్టడి చేసేందుకు 45 వేలకుపైగా పోలీసు బలగాలను మోహరించినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. నిరసనలను చల్లార్చేందుకు ఉన్న అన్ని ఆప్షన్లనూ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపింది. అయితే, కఠిన చర్యలు తీసుకుంటుండటంతో నిరసనల్లో హింస తీవ్రత తక్కువగా ఉందని పేర్కొంది.   

ఆ ఒక్క పోలీసుపైనే మా కోపం 

నహేల్ చనిపోవడానికి మొత్తం పోలీసులంతా కారణం కాదని, వారిపై తమకు ఎలాంటి కోపం లేదని నహేల్ తల్లి మౌనియా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నహేల్ ను కాల్చి చంపిన ఆ ఒక్క పోలీస్ ఆఫీసర్ పైనే మాకు కోపం ఉంది. మిగతా వాళ్లను మేం తప్పుపట్టట్లే. అతను అరబ్ మాదిరిగా కనిపిస్తున్న నా కొడుకుని చూశాడు. అందుకే కావాలనే చంపేశాడు” అని ఆమె ఆరోపించారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా తమ పిల్లల ప్రాణాలను బలిగొనడం ఏంటని ప్రశ్నించారు. కాగా, శనివారం నాంటెర్రే టౌన్ లోని ఓ మసీదు వద్ద ప్రార్థనల తర్వాత నహేల్ అంత్యక్రియలను అతని ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారని అధికారులు వెల్లడించారు.