వీడియో: మంటల్లో కాలిపోతూ 100 మీటర్ల పరుగు

వీడియో: మంటల్లో కాలిపోతూ 100 మీటర్ల పరుగు

గిన్నిస్ బుక్ రికార్డుల కోసం ప్రమాదకర స్టంట్స్ చేయడమన్నది అప్పుడప్పుడు జరిగే సంఘటనలే. ఆ కోవకు చెందిందే ఈ ఘటన. ఓ ఫైర్ మెన్.. శరీరానికి నిప్పు అంటించుకొని మంటల్లో కాలిపోతూ అత్యంత ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. వినడానికే భయంకరంగా ఉన్న ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ వీడియో చూస్తే.. ఒళ్లు జలదరించకమానదు. 

మంటల్లో కాలిపోతూ 100 మీటర్లు పరుగెత్తడమంటే మాటలు కాదు. అది కూడా కేవలం 17 సెకన్లలో. ప్రాణాలపై ఆశలు లేనివారే ఇలాంటి సాహసాలకు ఒడిగడతారు. ఫ్రాన్స్‌లో అగ్నిమాపక సిబ్బందిలో పని చేసే 39 ఏళ్ల జొనాథన్ ఈ ఫీట్ సాధించాడు. శరీరానికి నిప్పంటించుకొని 100 మీటర్ల దూరాన్ని 17 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు.. ఏకంగా 272.52 మీటర్ల దూరం పరుగెత్తాడు. అందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

జొనాథన్ ఒక ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్. చిన్ననాటి నుంచి నిప్పుతో ఆడుకుంటూనే పెరిగాడు.ఆ అభిరుచికి తగ్గట్టుగానే అగ్నిమాపక దళంలో చేరాడు. ఉద్యోగంలో భాగంగా జొనాథన్ చాలా క్లిష్టమైన సంఘటనలను ఎదుర్కొన్నాడట. ఎన్నో ప్రమాదకరమైన విన్యాసాలు పేస్ చేశాడట. ఇక తాను నెలకొల్పిన ప్రపంచ రెకార్డుపై జొనాథన్.. హర్షం వ్యక్తం చేశాడు. "నేను అగ్నిమాపక దళంలో పని చేస్తున్నాను. కఠినమైనప్పటికీ.. నేను శిక్షణలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ధీటుగా నేర్చుకున్నాను. ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది..' అని జొనాథన్ తెలిపాడు.