జైపూర్​లో మెక్రాన్​కు గ్రాండ్​ వెల్​కమ్​

జైపూర్​లో మెక్రాన్​కు గ్రాండ్​ వెల్​కమ్​
  • పింక్ సిటీలో మెగా రోడ్ షో
  • యూపీఐ చెల్లింపులతో షాపింగ్
  • చారిత్రక కట్టడాలను సందర్శించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

న్యూఢిల్లీ :  ఢిల్లీలో నిర్వహించే ఛబ్బీస్ జనవరి వేడుకల్లో చీఫ్ గెస్ట్​గా పాల్గొనేందుకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఇండియాకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజస్థాన్ రాజధాని జైపూర్​కు గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌ కల్‌‌‌‌రాజ్‌‌‌‌ మిశ్రా, సీఎం భజన్‌‌‌‌లాల్‌‌‌‌ శర్మ ఎయిర్ పోర్ట్​లో మెక్రాన్​కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్​షహర్ నుంచి జైపూర్ చేరుకున్నారు. మోదీ రాకముందు.. కేంద్ర మంత్రి జైశంకర్, సీఎం భజన్​లాల్ శర్మతో కలిసి మెక్రాన్ జైపూర్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అంబర్ ప్యాలెస్ వెళ్లారు. అక్కడ రెడ్ కార్పెట్ వేసి... ఏనుగుల అంబారీలతో గ్రాండ్ వెల్​కమ్ చెప్పారు. తర్వాత అక్కడి పురాతన కట్టడాలను పరిశీలించారు. వాటికి సంబంధించిన చరిత్ర, ప్రాముఖ్యతను అధికారులు మెక్రాన్​కు వివరించారు. తర్వాత అక్కడి నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన ‘జంతర్​మంతర్’కు వెళ్లారు. అక్కడే ప్రధాని నరేంద్ర మోదీతో ఇమ్మాన్యుయేల్​ మెక్రాన్ భేటీ అయ్యారు. జంతర్ మంతర్ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.

మెగా రోడ్​షోలో ఇరు దేశాల నేతలు

మోదీ, మెక్రాన్ కలిసి జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ వరకు నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్నారు. మధ్యలో ఉన్న హవా మహల్​ను కూడా సందర్శించారు. హవా మహల్ ప్రాముఖ్యతను మెక్రాన్​కు మోదీ వివరించారు. అక్కడే ఉన్న ‘సాహు’ టీ షాప్​లో ఇద్దరూ కలిసి జైపూర్ స్పెషల్ మసాలా చాయ్ తాగారు. తర్వాత హవా మహల్ వద్ద ఉన్న కొన్ని స్టాల్స్​ను సందర్శించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా.. యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి కొన్ని కళాఖండాలను కొనుగోలు చేశారు. కొంత మంది వ్యాపారులు, చిన్నారులతో మెక్రాన్ ఇంటరాక్ట్ అయ్యారు. తర్వాత మోదీ, మెక్రాన్ అక్కడి నుంచి నేరుగా రాంబాగ్ ప్యాలెస్ హోటల్​కు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి చర్చలు జరిపారు.  అనంతరం మోదీ, మెక్రాన్ కలిసి జైపూర్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు.