క్రూడాయిల్ కేవలం ఒక వనరు మాత్రమే కాదు.. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, రాజకీయాలను, పర్యావరణాన్ని ప్రభావితం చేసే గ్లోబల్ పవర్. అందుకే అభివృద్ధితోపాటు యుద్ధాలు, సంక్షోభాలకూ కారణమవుతోంది. 19వ శతాబ్దంలో ఒక చిన్న బావి నుంచి ప్రారంభమైన ఈ పరిశ్రమ.. నేడు బిలియన్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగింది. అంతెందుకు ప్రపంచాన్ని నడిపించే ఇంధనంగా మారింది. ఒక దేశ మనుగడ సాఫీగా సాగాలంటే సరిపడా క్రూడాయిల్ నిల్వలు ఉండాల్సిందే.
సాధారణంగా క్రూడాయిల్‌కు 19వ శతాబ్దం నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కానీ.. దాన్ని వనరుగా ఉపయోగించుకున్నది మనం మాత్రమే కాదు. కొన్ని దేశాల్లో వందల ఏండ్ల క్రితమే ప్రజలు క్రూడాయిల్‌ని వాడుకున్నారు. భూ ఉపరితలంపైకి బుడగలుగా వచ్చిన ముడి చమురును మధ్యప్రాచ్య ప్రజలు పడవలను వాటర్ రెసిస్టెంట్ చేయడానికి, భవన నిర్మాణంలో మోర్టార్‌గా వాడేవాళ్లు. ఈజిప్షియన్లు కూడా శవాలను మమ్మీలుగా మార్చే ప్రక్రియలో దీన్ని వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. చరిత్రకారులు చైనాలో క్రీస్తుపూర్వం 600ల్లో క్రూడాయిల్‌ను వెదురు పైపుల ద్వారా రవాణా చేసినట్టు చెప్తున్నారు. అయితే.. క్రూడాయిల్‌కు వాణిజ్య హంగులు అద్దింది మాత్రం 19వ శతాబ్దంలోనే.
1859 ఆగస్టు 27న అమెరికాలో మొదటిసారి క్రూడాయిల్‌ని వాణిజ్యం కోసం ఉత్పత్తి చేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని టైటస్విల్‌లో 69.5 అడుగులు డ్రిల్ చేసి మొదటి ఆయిల్ బావిని తవ్వారు. ఆ బావి నుంచి రోజుకు 12 నుంచి 20 బ్యారెళ్ల క్రూడాయిల్ ఉత్పత్తి అయ్యేది. ఇప్పటికీ ఆ బావి ఉంది. అక్కడ ఇప్పుడు మ్యూజియం ఏర్పాటు చేశారు.
మొదట కిరోసిన్..
ఒకప్పుడు ల్యాంప్‌లకు వేల్ ఆయిల్ (తిమింగలం నూనె) ఉపయోగించేవాళ్లు. అది ఖరీదైనది. ప్రమాదకరమైనది కూడా. క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి చేసే కిరోసిన్‌ని రిఫైన్ చేసి మండిస్తే సురక్షితంగా, కాంతివంతంగా వెలుగుతుందని ప్రయోగాల్లో తేలింది. పైగా ఇది చాలా చవకైనది. అందుకే కిరోసిన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. దాంతోపాటే క్రూడాయిల్ వ్యాపారం పెరిగింది. అమెరికాలో రిఫైనరీలు మొదలయ్యాయి. పదేండ్లలోనే ఉత్పత్తి భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం క్రూడాయిల్‌ను అమెరికానే సప్లై చేసేది.
మొదటి కారు.. పెరిగిన డిమాండ్
జర్మన్ ఇంజనీర్ కార్ల్ బెంజ్ 1885లో మొదటి మోటారు కారును కనుగొన్నాడు. ఈ కొత్త వాహనం క్రూడాయిల్ నుంచి తయారయ్యే గ్యాసోలిన్‌తో నడిచేది. కార్ల వినియోగం పెరగడంతో గ్యాసోలిన్ డిమాండ్ కూడా రోజురోజుకూ పెరిగింది. క్రూడాయిల్ ఉత్పత్తి పెంచాల్సి వచ్చింది. సరిగ్గా అదే టైంలో మిడిల్ ఈస్ట్‌లో క్రూడాయిల్ నిల్వలను కనుగొన్నారు. కానీ.. ఆ దేశాల దగ్గర దాన్ని వెలికితీసే టెక్నాలజీ లేదు. వెస్ట్రన్ కంపెనీలు వాటినుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ అన్వేషణ, వెలికితీత హక్కులను పొందాయి. అరబ్ దేశాల్లో ఉత్పత్తి బాగా పెరిగింది. ప్రపంచదేశాలకు అవే ప్రధాన ఎగుమతి దారులుగా మారాయి.
మొదటి సంక్షోభం
ప్రపంచంలో మొట్టమొదటి క్రూడాయిల్ సంక్షోభం 1973 అక్టోబర్‌లో వచ్చింది. 1974 మార్చి వరకు కొనసాగింది. దీనిని ‘‘అరబ్ ఆయిల్ ఎంబార్గో” అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపింది. 1973 అక్టోబర్ 6న ఈజిప్ట్, సిరియాలు ఇజ్రాయెల్‌పై ఆకస్మికంగా దాడి చేశాయి. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు సైనిక సాయం అందించింది.
దాంతో ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలకు క్రూడాయిల్ ఎగుమతులపై ఎంబార్గో (నిషేధం) విధించాయి. క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించి, ధరలను భారీగా పెంచాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 2.9 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్న ధర కొన్ని నెలల్లోనే 11.65 డాలర్లకు పెరిగింది.
క్రూడాయిల్ కొరతతో అమెరికాలో పెట్రోల్ స్టేషన్ల దగ్గర క్యూలు పెరిగాయి. చాలా దేశాలు రేషనింగ్, ఆర్థిక మాంద్యం, ఇన్‌ఫ్లేషన్.. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
నిల్వలు ఎందుకు?
1973 సంక్షోభం తర్వాత దాదాపు అన్ని దేశాలు క్రూడాయిల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఎస్పీఆర్ (స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్) మెయింటెయిన్ చేయడం మొదలుపెట్టాయి. 1974లో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ స్థాపించబడింది. ఇది 90 రోజులపాటు క్రూడాయిల్ దిగుమతి నిలిచిపోయినా నష్టం వాటిల్లకుండా నిల్వలను మెయింటెయిన్ చేయాలని సూచించింది. ఇప్పుడు దాదాపు 30 దేశాలు క్రూడాయిల్ రిజర్వ్స్‌ని మెయింటెయిన్ చేస్తున్నాయి.
చైనాలో ఎక్కువ
కొన్ని అంచనాల ప్రకారం చైనా అత్యధిక ఎస్పీఆర్ మెయింటెయిన్ చేస్తోంది. 2026 మార్చి నాటికి చైనా రిజర్వ్స్ సుమారు 900 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంది. చైనా ప్రపంచంలో అత్యధికంగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునే దేశం కాబట్టి, దాని డైలీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రిజర్వ్స్ కూడా ఎక్కువే. కానీ.. ఈ రిజర్వ్స్ దాని దిగుమతి అవసరాలను 104 నుంచి 115 రోజులు మాత్రమే తీర్చగలవు. జియోపొలిటికల్ రిస్క్‌లు పెరగడంతో చైనా గడిచిన కొన్నేండ్లలో నిల్వలను భారీగా పెంచుకుంది.
అమెరికాలో తగ్గుదల
క్రూడాయిల్ రిజర్వ్స్‌లో అమెరికా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 415 మిలియన్ బ్యారెళ్లు ఉంది. గతంలో 700 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉండేది. కానీ, రష్యా–యుక్రెయిన్ యుద్ధం సమయంలో భారీగా రిలీజ్ చేయడం వల్ల తగ్గింది. ఈ రిజర్వ్స్ దాని దిగుమతి అవసరాలను సుమారు 200 రోజుల వరకు తీర్చగలవు.
జపాన్ సేఫ్..
జపాన్ దగ్గర సుమారు 250 మిలియన్ బ్యారెళ్లు ఉంది. ఇది పూర్తిగా దిగుమతులపై ఆధారపడిన దేశం. పబ్లిక్, ప్రైవేట్ స్టాక్స్ కలిపి మొత్తం కవరేజ్ సుమారు 250–260 రోజుల వరకు ఉంటుంది. దక్షిణ కొరియా దగ్గర 150 మిలియన్ బ్యారెళ్లు ఉంది. అది దిగుమతి అవసరాలను సుమారు 210 రోజుల వరకు తీర్చగలదు. సింగపూర్ దగ్గర 100 మిలియన్ బ్యారెళ్లు ఉంది. దీని కవరేజ్ సుమారు 245 రోజులు ఉంటుంది.
మన దగ్గర
మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతిదారు. కానీ.. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇతర దేశాలతో పోలిస్తే కాస్త తక్కువే. సుమారు 39 మిలియన్ బ్యారెళ్ల రిజర్వ్స్ ఉన్నాయనేది ఒక అంచనా. దీంతోపాటు రిఫైనరీలు, పోర్టులు, ఫ్లోటింగ్ స్టోరేజ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్, పెట్రోల్, డీజిల్, ఇతర ప్రొడక్ట్స్ కలిపి సుమారు 74 రోజుల అవసరాలను తీర్చగలవు.
క్రూడాయిల్‌ని స్టోర్ చేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే మన దేశంలో రిజర్వ్స్ కెపాసిటీని పెంచడంలేదు. స్టోరేజీ కోసం భూగర్భ గుహలు (క్యావెర్న్స్) తవ్వాలి. స్టోరేజీ ట్యాంకులు నిర్మించాలి. సేఫ్టీ, పైప్‌లైన్లు, పోర్ట్ కనెక్షన్ల కోసం కూడా భారీగా ఖర్చు చేయాలి.
వెనిజువెలాలో ఎక్కువ
ప్రపంచంలో క్రూడాయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో వెనిజువెలా ఉంది. 2025-2026 అంచనాల ప్రకారం వెనిజువెలాలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ నిల్వలు ఉన్నట్టు కనుగొన్నారు. ఇది ప్రపంచ మొత్తం నిల్వల్లో దాదాపు 17 శాతం. కాకపోతే.. ఇక్కడున్నదంతా హెవీ ఆయిల్. దాన్ని బయటికి తీయడం కాస్త కష్టమే. పైగా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, అధునాతన టెక్నాలజీ లేకపోవడం వల్ల వెనిజువెలా ఉత్పత్తి, ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి.
నిల్వల్లో రెండో స్థానంలో సౌదీ అరేబియా ఉంది. అక్కడ సుమారు 267 బిలియన్ బ్యారెళ్లు ఉంది. ఘవార్ ఫీల్డ్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్‌లు సౌదీలో ఉన్నాయి. మూడో స్థానంలో ఇరాన్ ఉంది. దాని నిల్వలు 209 బిలియన్ బ్యారెళ్లు. తర్వాత ఈ లిస్ట్‌లో కెనడా (163 బిలియన్ బ్యారెళ్లు), ఇరాక్ (145 బిలియన్ బ్యారెళ్లు), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (113 బిలియన్ బ్యారెళ్లు), రష్యా (108 బిలియన్ బ్యారెళ్లు), కువైట్ (102 బిలియన్ బ్యారెళ్లు) లాంటి దేశాలు ఉన్నాయి. అయితే.. మొత్తం నిల్వల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే దాదాపు 50 శాతానికిపైగా ఉండడంతో ప్రపంచ దేశాలు వాటిపైనే ఆధారపడ్డాయి.
సౌదీ టాప్
క్రూడాయిల్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. ఇది రోజుకు సుమారు 7.5 మిలియన్ బ్యారెళ్లు ఎగుమతి చేస్తోంది. ప్రపంచ ఎగుమతుల్లో దాదాపు 14 శాతం వాటాని కలిగిఉంది. రెండో స్థానంలో రష్యా ఉంది. రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లు ఎగుమతి చేస్తోంది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (3.5 మిలియన్ బ్యారెళ్లు), ఇరాక్ (3.4 మిలియన్ బ్యారెళ్లు), అమెరికా (3.2 మిలియన్ బ్యారెళ్లు), కెనడా (3 మిలియన్ బ్యారెళ్లు), కువైట్ (2.2 మిలియన్ బ్యారెళ్లు), నైజీరియా (1.5 మిలియన్ బ్యారెళ్లు), ఇరాన్ (1.2 మిలియన్ బ్యారెళ్లు), బ్రెజిల్ (1.1 మిలియన్ బ్యారెళ్లు) ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలు మొత్తం ఎగుమతుల్లో 60 శాతం పైగా వాటా కలిగి ఉన్నాయి.
