
అది మౌంట్ ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. అతనో ఆటో డ్రైవర్ కొడుకు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద నేపథ్యం అతనిది. ఉండేది చిన్న గ్రామంలో. కానీ, అతను అందరిలో ఒకడిలా మిగిలిపోకుండా అందనంత ఎత్తుకు ఎదగాలనుకున్నాడు. అతి తక్కువ సమయంలో ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలు అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన దివంగత మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో అతను కూడా మౌంటెనీర్ కావాలనుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన ఏడు పర్వతాలను అధిరోహిచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నా ముందుకు సాగిన అతను ఇప్పటికే మూడింటిని పూర్తి చేశాడు. ఇటీవలే మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆ యువకుడి పేరు గుంటల తిరుపతి రెడ్డి. వికారాబాద్ జిల్లా, ఎల్లకొండ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ఈ యువకుడు తన ధైర్యసాహసాలతో జిల్లాకు, రాష్ట్రానికి పేరు తెస్తున్నాడు.
మస్తాన్‌బాబు స్పూర్తితో…
ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తున్న తిరుపతిరెడ్డికి పర్వతారోహణమంటే ఎంతో ఇష్టం. 2015 మార్చి 24న ప్రఖ్యాత పర్వతారోహకుడు మస్తాన్ బాబు పర్వతారోహణ చేస్తూ మృతి చెందడం అతడిని కలచివేసింది. అతని ఆలోచనలు మస్తాన్‌బాబు చుట్టే తిరిగాయి. ఐదంకెల జీతం, హాయిగా సాగిపోయే జీవితం.. అవన్నీ వదిలిపెట్టి ఓ వ్యక్తి పర్వతారోహణ చేయడమేంటి? అని ఆలోచించాడు. ప్రపంచంలోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేశారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో చేరారు. ప్రొఫెషనల్ మౌంటెనీర్ శేఖర్‌బాబు వద్ద శిక్షణ పొందాడు. ఎత్తయిన గుట్టలు ఎలా ఎక్కాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలన్నీ తెలుసుకున్నాడు. భువనగిరిగుట్టను తిరుపతిరెడ్డి తొలి ప్రయత్నంలోనే అధిరోహించి.. పర్వతారోహణకు బాటలు వేసుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన శేఖర్.. పర్వతారోహణకు తగిన శిక్షణ ఇచ్చి పర్వతారోహణను తట్టుకునే శరీర ధారుడ్యం పెంపొందించాడు. కొద్ది రోజుల తర్వాత శేఖర్ బాబు సహకారంతో కిలిమంజారో పర్వతం ఎక్కే అవకాశం వచ్చింది. కానీ, తిరుపతికి అంత ఆర్థిక స్థోమత లేదు దాతలు అందించిన ఆర్థిక సహాయంతో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి ఆఫ్రికా బయలుదేరాడు. సముద్రమట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని అక్టోబర్, 2017 లో తిరుపతి రెడ్డి నాలుగు రోజుల్లోనే అధిరోహించి భారత మువ్వన్నెల జెండాను కిలిమంజారో శిఖరం పై రెపరెపలాడించాడు. తర్వాత ఏడాది మార్చి ,2018 లో ఆస్ట్రేలియాలోని 2,228 మీటర్ల ఎత్తులో ఉన్న కొసియాస్కో పర్వతాన్ని రెండురోజుల్లోనే అధిరోహించాడు.
ప్రభుత్వ ప్రోత్సాహం శూన్యం.. విరాళాలతో ముందుకు..
2018 లోనే రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ పర్వతం ఎక్కే అకాశం తిరుపతికి వచ్చింది. ఆర్థిక స్థోమత లేనందున ఆ అవకాశం కోల్పోయాడు. అయినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో ఇంకా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఈ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నిశ్చయించుకున్నాడు. అయితే, ఇప్పటి వరకు ఎక్కిన పర్వతాలు చిన్నవి. వాటిని అధిరోహించడానికి కావలసిన వ్యయం కూడా తక్కువే. కానీ 8,848 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలంటే దానికయ్యే అయ్యే ఖర్చు కూడా ఎవరెస్ట్ అంత ఎత్తు ఉంది. అందుకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిసి తిరుపతి రెడ్డి నిరాశకు గురయ్యాడు. అయినా, లక్ష్యం ముందుంటే మనసు పెట్టి పట్టుదలతో పని చేస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని తలచి ముందుకు సాగాడు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం పొందడానికి తిరుపతిరెడ్డి ప్రయత్నించినా ఆ వైపు నుంచి స్పందన కరువైంది. దాంతో, మరోసారి దాతల సహాయం కోరాడు. తిరుపతిరెడ్డిని ప్రోత్సహించడానికి బీడీఎల్ ఎంప్లాయిస్ యూనియన్ విన్నర్ ఫౌండేషన్ ఎంతగానో కృషి చేసింది. వారికున్న పరిచయాలతో ఆర్థిక సహాయాన్ని అందజేసింది. తిరుపతిరెడ్డి విజయం సాధించే వరకు విన్నర్ ఫౌండేషన్ వెన్నంటి ప్రోత్సహించింది. మరికొందరు కూడా ఆర్థిక సహాయం చేసారు మొత్తానికి ఎవరెస్ట్ అధిరోహహించడానికి కావలసిన డబ్బు సమకూరింది.
గ్రామీణ యువతకు అంకితం …
ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు ప్రతికూల వాతావరణంతో చాలా ఇబ్బందులు పడ్డామన్నాడు తిరుపతి రెడ్డి. అంతేకాదు “చాలా మంది మార్గమధ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు. బేస్ క్యాంప్ నుంచి బయలుదేరుతున్నప్పుడు కచ్చితంగా ఎవరెస్ట్ అధిరోహించే కిందకి దిగాలనే సంకల్పంతో ముందుకెళ్లా. ప్రాణాలకు బయపడకుండా విజయవంతంగా ఎవరెస్ట్ ని అధిరోహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం నా స్పాన్సర్లకు, నాలాంటి ఎందరో గ్రామీణ యువకులకు అంకితమిస్తున్నా. ఎవరెస్ట్‌కు ఎక్కడానికి బయలుదేరే ముందు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. బీడీఎల్ ఉద్యోగులకు చెందిన విన్నర్స్ ఫౌండేషన్, శంకర్ పల్లికి చెందిన ఆత్మలింగం, కొంత మంది దాతలు ఆర్థికంగా ఆదుకోవడంతో నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నా’ అని అన్నాడు తిరుపతి రెడ్డి.