‘ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టిన రోజే మార్పు మొదలవుతుంది’ అన్నారు పెరియార్.
విజయ్ కేవలం ఒక సినిమా హీరో కాదు. అతను ఒక భావోద్వేగం. ఒక ఆశ. కులం, మతానికి అతీతంగా, రాజకీయ వారసత్వం లేకుండా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మద్దతు లేకుండా, పొత్తులు లేకుండా, సింగిల్‌గా కేవలం ప్రజల మీద, తన మీద నమ్మకంతో టీవీకే పార్టీని స్థాపించి.. రెండేళ్లలో తమిళనాడు రాజకీయాలను మార్చేశాడు. ద్రావిడ సిద్ధాంత పునాదులపైనే 60 సంవత్సరాల చరిత్ర గల ద్రావిడ పార్టీలను మట్టి కరిపించాడు. అతని విజయం తెలంగాణ బహుజన యువతకు ఒక పిలుపు. ‘మనం కూడా చేయగలం. మనం కూడా గెలవగలం!’ వారి విజయం నుంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చును.
విజయ్ సామాన్య జనంతో పార్టీ నిర్మాణం చేశాడు. అభిమాన సంఘాలను క్యాడర్‌గా మార్చి, ఒక రాజకీయ శక్తిని సృష్టించాడు. ఆత్మ గౌరవ భావజాల పునాది వేశాడు. యువతను ముఖ్యంగా జెన్ జీ (Z)తరంను ఆకట్టుకున్నాడు. యువ శక్తి మేల్కొంటే మారనిది ఏమీ లేదని నిరూపించాడు. ఇక్కడ బీసీలు నేర్చుకోవాల్సినదేమంటే బీసీ ఐడెంటిటీ మన మూలం. కానీ అది మన పరిమితి కాకూడదు. మన ఉద్యమం బీసీలతో మొదలై.. బహుజనులతో మమేకమై, యువశక్తితో కలిసి తెలంగాణ అంతటా విస్తరించాలి. మనది సెక్షనల్ ఉద్యమం కాదు. సామూహిక ఆత్మగౌరవ ఉద్యమం కావాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడే బహుజన రాజ్యాధికారం సాకారమవుతుంది.
భావోద్వేగాల యుద్ధం గెలిచినవాడే చరిత్ర మార్చగలడు
విజయ్ ముందుగా ప్రజల హృదయాలను గెలిచాడు. గత 16 సంవత్సరాలుగా తన సామాజిక సేవా సంస్థ అయిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థులకు ఉచిత ట్యూషన్స్, పదో తరగతి టాపర్స్‌కు సన్మానం మొదలగునవి చేపట్టి జన హృదయాలను గెలుచుకున్నాడు. తర్వాత రాజకీయంగా గెలుచుకున్నాడు. అతని క్లీన్ ఇమేజ్, అన్యాయంపై ఆగ్రహం యువతను కదిలించాయి. బీసీ ఉద్యమం కూడా గణాంకాలతో ప్రజలకు జరిగిన అన్యాయాలను వివరిస్తూ ప్రజలలో భావోద్వేగాలు పెంపొందేలా చేయాలి. వ్యవస్థలను మార్చగలం అనే నమ్మకం కలిగించాలి. సరళమైన, హృదయానికి తాకే భాషలో మాట్లాడాలి. రోజువారీ అవమానాలను సామూహిక ఆగ్రహంగా మార్చాలి. మేమెంతో మాకంత, ఓటు మాది, సీట్ మీదా? ఇకపై చెల్లదు అనే నినాదం ప్రతి ఇంటిలో మార్మోగేలా చేయాలి.
స్వతంత్రత & స్వాభిమానం
విజయ్ ఎవరి దయకోసం ఎదురుచూడలేదు. తన సొంత వేదికను తన స్వశక్తితో నిర్మించాడు. బీసీలు, బహుజనులు గుర్తించాల్సిన సత్యం ఏమిటంటే.. ఇతరుల పార్టీల్లో కొన్ని పొజిషన్లు పొంది తృప్తి చెందడం మనల్ని ఎప్పటికీ బానిసలుగా ఉంచుతుంది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ అగ్రకుల, ఆధిపత్య రాజకీయ పార్టీలే. స్వతంత్ర రాజకీయ పార్టీ లేకుండా బీసీలు, బహుజనులకు నిజమైన ఆత్మగౌరవం, రాజకీయాధికారం సాధ్యం కాదు. జెండాలు /అజెండాలను పక్కన పెట్టి బహుజన ఉద్యమంలోకి రండి. సొంత రాజకీయ పార్టీని నిర్మించండి.
నమ్మకం Vs డబ్బు
డబ్బుతో కొన్ని ఓట్లు కొనవచ్చు, కానీ, నమ్మకం హృదయాలను గెలుస్తుంది. విజయ్ నిరూపించింది ఇదే. ప్రజల నమ్మకం ఉంటే డబ్బు ఏమీ చేయలేదు. విజయ్ ఎన్నికలలో పెద్దగా డబ్బు ఖర్చుపెట్టలేదు. తెలుగు రాష్ట్రాల్లో ‘డబ్బే రాజకీయాలను శాసిస్తుంది’ అని భావించేవారికి ఇది ఒక హెచ్చరిక. డబ్బుపైనే ఆధారపడకుండా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రజల విశ్వాసాన్ని సంపాదించినప్పుడు డబ్బు ప్రాధాన్యత సహజంగానే తగ్గిపోతుంది. నిజంగా డబ్బే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి అయితే డబ్బున్నవాళ్లే ఎప్పటికీ గెలుస్తూ ఉండాలి. అప్పుడు మార్పు అనే మాటకు అర్థమే ఉండదు. అధికార పార్టీలు కూడా శాశ్వతంగా కొనసాగాలి . కానీ ప్రజాస్వామ్యంలో మార్పు జరుగుతోంది అంటే, ప్రజలు డబ్బుకు అతీతంగా కూడా ఆలోచించి ఓటు వేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ప్రజల నమ్మకాన్ని సంపాదించడమే నిజమైన రాజకీయ విజయానికి పునాది.
ఉద్యమానికి దిశ చూపేది సిద్ధాంతం
ఉద్యమాలు కేవలం ఆగ్రహంతో, ఎమోషన్స్‌తో నిలబడవు. వాటికి దిశ చూపేది సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి జీవం పోసేది మార్గదర్శకులు. టీవీకే తన రాజకీయ ప్రయాణంలో కొందరు మహానుభావుల ఆలోచనలను దిక్సూచిగా తీసుకుంది. సామాజిక న్యాయం, సమానత్వం, సెక్యులరిజం వంటి విలువలకు పునాది వేసిన మహానుభావులు.. డా. బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు, సామాజిక న్యాయం మహానేత. పెరియార్ ఈ.వి. రామస్వామి సామాజిక సంస్కరణలు, మహిళా హక్కులు, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన యోధుడు.
కే. కామరాజ్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పరిపాలనలో పారదర్శకత, ప్రజాహితం కోసం గుర్తింపు పొందిన నాయకుడు . అదేవిధంగా టీవీకే ‘నిస్వార్థ సేవ’ సిద్ధాంతానికి ప్రేరణగా నిలిచిన ఇద్దరు చారిత్రక మహిళా యోధులను కూడా ప్రాముఖ్యంగా చేర్చింది. 1. వెలు నాచియార్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి మహిళా పాలకురాలు, 2. అంజలై అమ్మాళ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక సేవలో ఆదర్శప్రాయమైన వ్యక్తి.
తెలంగాణలోనూ మార్గదర్శకులకు కొదవ లేదు . ఒక సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, పండగ సాయన్న , చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలక్కలు, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీ. శివశంకర్ , ప్రొ. జయశంకర్ , తొలితరం దళిత ఉద్యమ నాయకుడు భాగ్య రెడ్డి వర్మ.. వీరందరూ కూడా తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. వారి వారసత్వాన్ని బాటగా మలుచుకుని ముందుకుసాగాలి. సిద్ధాంతాలతోనే మన భవిష్యత్తును నిర్మించాలి. ఎందుకంటే సిద్ధాంతం ఉన్న ఉద్యమమే చరిత్రను మార్చగలదు.
క్యాడర్, సోషల్ మీడియాలే ఆయుధాలు
అట్టడుగు స్థాయి క్యాడర్, సోషల్ మీడియాయే అసలైన ఆయుధాలు ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మద్దతు లేకపోయినా, సోషల్ మీడియా, గ్రామస్థాయి క్యాడర్‌తో విజయ్ ముందుకువెళ్లాడు. ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ముందుకు వెళ్లిన మనో ధైర్యం విజయ్ను ప్రజలలో ఒక నిజమైన హీరోను చేసింది. మన వ్యూహం కూడా ప్రతి గ్రామంలో, మున్సిపల్ వాడలో కనీసం కులానికి ఒక కార్యకర్త, ప్రతి మొబైల్‌లో ఒక సందేశం, ప్రతి యువకుడే ఒక ప్రచారకర్తలాగ ఉండేలా చూసుకోవటం .
సోషల్ మీడియా ద్వారానే కోట్లాది మంది ప్రజలతో విజయ్ కనెక్ట్ అయ్యాడు. నిజానికి ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సమయం చాలా తక్కువ. మొత్తం చూసుకుంటే 200 గంటలు కూడా ఎన్నికల ప్రసంగాలు చేయలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి ప్రజల్లో తన ఆలోచనలను బలంగా చేరవేశాడు. మన పరిస్థితి కూడా ఇదే. సోషల్ మీడియానే ప్రధాన ఆయుధంగా మలుచుకుని ప్రతి వ్యక్తికి చేరువ కావాలి. ప్రతి యువకుడిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో బీసీ / బహుజన భావజాలాన్ని నింపాలి. ఆలోచనలను ప్రజల మధ్యకు తీసుకెళ్లగలిగితేనే ఉద్యమం బలపడుతుంది, మార్పు సాధ్యమవుతుంది.
గౌరవప్రదమైన భాష
జన నాయకుడు విజయ్ గౌరవంగా మాట్లాడాడు. అందుకే విస్తృత మద్దతు పొందాడు. ఆగ్రహం ఉండాలి కానీ అసభ్య భాష కాదు. గౌరవంతో కూడిన పోరాటమే ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. తెలంగాణలో మన నాయకుల బాష చూస్తుంటే సిగ్గేస్తుంది. బీసీ నాయకులూ కూడా గౌరవ ప్రదమైన భాషను వాడటం నేర్చుకోవాలి.
చరిత్ర సృష్టించే ఉద్యమం
విజయ్ అత్యంత జనాకర్షక వ్యక్తి, బీసీ ఉద్యమం ఒక సామూహిక పోరాటం. మనకు అట్లాంటి జనాకర్షక నాయకుడు లేడు. కానీ మన బలం వందల మంది నాయకులు, వేలమంది కార్యకర్తలు, లక్షల మంది యువత. ఇది ఒక ఉద్యమం. ఒక వ్యక్తి కథ కాదు, వ్యక్తితో వచ్చి వ్యక్తితో పోయేది కాదు. శాశ్వతంగా చరిత్ర సృష్టించబోయే ఉద్యమం.
సరైన టైమింగ్ & చరిత్ర సృష్టి
పాత రాజకీయాలపై విసుగు వచ్చిన సమయంలో విజయ్ ప్రవేశించాడు. చరిత్ర సృష్టించాడు. ఈ రోజు తెలంగాణలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీకి అవకాశం ఉంది. ప్రజలలో అసంతృప్తి ఉంది. దానిని మనం ఉద్యమంగా మలచాలి. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉద్యమాన్ని రూపొందించాలి.
రాజకీయ వారసత్వం లేకుండానే..
విజయ్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. అయినప్పటికీ ప్రజలతో బలమైన అనుబంధం ఏర్పరచుకోగలిగాడు. కాబట్టే రాజకీయంగా రాణించగలిగాడు. దాదాపు 60 ఏళ్లుగా తమిళనాడును శాసించిన ద్రవిడ రాజకీయ పార్టీలకు సవాల్ విసరగలిగాడు. అయితే, ఆయన ఓడించింది ద్రవిడ సిద్ధాంతాన్ని కాదు. ఆ సిద్ధాంతాన్ని తమ స్వార్థ రాజకీయాలకు పరిమితం చేసిన పార్టీల ఆధిపత్యాన్నే. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బహుజన ప్రజలకు మనం అర్థం చేయించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ వారసత్వం అవసరం లేదు.
ప్రజల మనసులను గెలుచుకునే సిద్ధాంతం, స్పష్టమైన ఆలోచన, ప్రజలతో అనుబంధం ఉండే సాధారణ వ్యక్తి కూడా రాజకీయాల్లో ఎదగగలడు అని బోధించాలి. మన భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా, వారి జీవితాలకు అనుసంధానమయ్యేలా తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే ప్రజల్లో ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచనే చైతన్యానికి దారి తీస్తుంది. ఆ చైతన్యమే మార్పుకు నాంది అవుతుంది. మనమే ఒక శక్తి. మన ఉద్యమం కోట్ల మంది ఆత్మగౌరవం. సిద్ధాంతమే మన పునాది . మార్గదర్శకులే మన బలం. మనలో ఉన్న ఈ ఆగ్రహ జ్వాలకు, సిద్ధాంత బలం తోడైతే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. ‘హిస్సా, ఇజ్జత్, హుకుమత్ కోసం , మన ఉద్యమం ముందుకుసాగాలి రాజ్యాధికారం సాధించుకోవాలి. అప్పుడే తెలంగాణ కోసం అమరులైన వారి ఆత్మలు శాంతిస్తాయి. సామాజిక తెలంగాణ ఏర్పాటవుతుంది.
- టి.చిరంజీవులు,విశ్రాంత ఐఏఎస్, ఛైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
