
బాగా చదువుకుని లైఫ్‌లో సెటిల్ కావాలి అనుకుంది. కానీ.. చదువుకునే రోజుల్లోనే నాన్న చనిపోయాడు. ఆ బాధ నుంచి బయటపడేందుకు తనకు ఎంతో ఇష్టమైన కుకింగ్ వీడియోలు చేసింది షమీరా. సిగ్గుతో కెమెరాకు అస్సలు ముఖం చూపించేది కాదు. అయినా.. ఆమె వంట చేసే విధానం అందరికీ నచ్చింది. ఏడాదిలోనే లక్ష సబ్‌స్క్రయిబర్లను సంపాదించి ఫేమస్ యూట్యూబర్ అయిపోయింది.
షమీరా కేరళలోని తిరువనంతపురం దగ్గర్లోని నెమోమ్ గ్రామంలో పుట్టి, పెరిగింది. ఆమెకు చిన్నప్పటినుంచే వంట చేయడమంటే బాగా ఇష్టం. అందుకే ఎప్పుడూ వాళ్ల అమ్మ రఫియత్‌కు కిచెన్‌లో సాయం చేస్తుండేది. తల్లి వంటగదిలో రుచిగా వంటలు చేస్తుంటే షమీరా శ్రద్ధగా చూస్తూ నేర్చుకునేది. కూరగాయలు కోయడం నుంచి మసాలాలు కలపడం వరకు చిన్న చిన్న పనులన్నీ తనే చేసేది.
కిచెన్‌లో ఎక్కువ టైం గడపడం వల్ల వంట మీద మరింత ప్రేమ పెరిగింది. పెద్దయ్యాక రకరకాల వంటల పుస్తకాలు సేకరించింది. అదే ఆమె వృత్తిగా మారుతుందని ఏమాత్రం ఊహించలేదు. గవర్నమెంట్ ఉద్యోగం సాధించి లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనుకుంది. సరిగ్గా ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న టైంలో 2017లో వాళ్ల నాన్న చనిపోయాడు. దాంతో షమీరా జీవితం అంతా తారుమారైంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాధ నుంచి చాలారోజుల పాటు కోలుకోలేకపోయింది.
ఫ్రెండ్ సలహాతో..
షమీరా బాధను గమనించిన తన ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చింది. ఆమెకున్న కుకింగ్ స్కిల్స్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పింది. అందుకు షమీరా ఒప్పుకోలేదు. కానీ.. తన ఫ్రెండ్ పదే పదే చెప్తుండడంతో చివరికి ఒక ప్రయత్నం చేసి చూడాలనుకుంది. దాంతో తన దగ్గరున్న మొబైల్, ట్రైపాడ్ సాయంతోనే ఇంట్లోని కిచెన్‌లో మూడు వంట వీడియోలను రికార్డ్ చేసింది. వాటిని పెద్దగా ఎడిటింగ్ కూడా చేయకుండానే ‘షమీష్ కిచెన్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టి, అందులో అప్‌లోడ్ చేసింది. చానెల్‌లో మూడు వీడియోలే ఉన్నా వ్యూస్ బాగానే వచ్చాయి. ఆమె వంట చేసే విధానం, వివరించే తీరు అందర్నీ ఆకట్టుకుంది. దాంతో ఆ వీడియోలకు ఎన్నో పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. చాలామంది మరిన్ని వీడియోలు చేయాలని రిక్వెస్ట్ చేశారు. కొందరు ఆమెని ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు.
సింపుల్‌గా ఉన్నా..
షమీరా అప్‌లోడ్ చేసిన మూడు వీడియోలు చాలా సింపుల్‌గా ఉన్నాయి. వీడియో క్వాలిటీ, ఎడిటింగ్ బాగా లేవు. పైగా వాటిలో కనీసం ఆమె ముఖం కూడా చూపించలేదు. అయినా అందరికీ నచ్చాయి. దాంతో ఆమె మరిన్ని వీడియోలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ.. ఇప్పటికీ వీడియోల్లో ఆమె చాలా తక్కువగానే కనిపిస్తుంటుంది. తన చేతులు, ఇంగ్రెడియెంట్స్, స్టవ్ మాత్రమే కనిపిస్తాయి. ఆ సింపుల్ ఫార్మాట్‌ని చాలామంది ఇష్టపడ్డారు. పైగా ఆమె వంటగదిలో దొరికే ఇంగ్రెడియంట్స్‌తోనే వంటలు చేస్తుండడంతో ఎక్కువమంది కనెక్ట్ అయ్యారు.
కానీ.. అనుకున్నంత స్థాయిలో సబ్‌స్క్రయిబర్ల సంఖ్య పెరగలేదు. ఆమెకు మొదటి సక్సెస్ టీ స్ట్రైనర్‌ను శుభ్రం చేసే ఒక కిచెన్ టిప్ వీడియోతో వచ్చింది. వాస్తవానికి ఆ వీడియో వైరల్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. అది వైరల్ అయినప్పుడు అందులోని పాత వీడియోలకు కూడా వ్యూస్ పెరిగాయి. చాలామంది చానెల్‌ని సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. అప్పటివరకు ఆమె తన గొంతు అంతగా బాగుండదు అనుకునేది. కానీ.. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య పెరగడంతో తనపై తనకు కాన్ఫిడెన్స్ పెరిగింది.
ఏడాదిలోనే లక్ష
షమీరా 2017 సెప్టెంబర్ 14న ‘షమీస్ కిచెన్’ యూట్యూబ్ చానెల్ పెట్టింది. ఏడాదిలోనే సబ్‌స్క్రయిబర్ల సంఖ్య లక్షకు చేరింది. 2019 నాటికి మిలియన్ సబ్‌స్క్రయిబర్ల మైలురాయిని దాటేసింది. అప్పటినుంచి సంప్రదాయ భారతీయ వంటకాలతోపాటు విదేశీ వంటకాలు, తందూరీ చాయ్ లాంటి కొత్త కొత్త రెసిపీలు చేసి, అన్ని రకాల వ్యూయర్స్‌ని ఆకట్టుకుంది.
అందరూ ఈజీగా వండగలిగేలా ఉండే వంటకాలనే ఎంచుకుంటుంది. అందుకే చానల్ ట్యాగ్‌లైన్‌ని “నేను వండగలిగితే, మీరు కూడా వండగలరు” అని పెట్టింది. ఆమె ఏ వంట చేసినా ముందుగా దాన్ని టేస్ట్ చేసి బాగుంది అనుకుంటేనే ఆ వీడియోని అప్‌లోడ్ చేస్తుంది. చానెల్‌లో ఇప్పటివరకు 1,899 వీడియోలు అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం చానెల్‌కు 5.56 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు.
ఎన్నో సవాళ్లు..
ఒక యూట్యూబ్ చానెల్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. షమీరా అలాంటివి ఎన్నో అధిగమించింది. మొదట్లో అసలు ఆమెకు వీడియో ఎలా తీయాలో కూడా తెలియదు. అలాంటిది చాలా కష్టపడి వీడియోగ్రఫీ, ఆ తర్వాత సొంతంగా ఎడిటింగ్ నేర్చుకుంది. వీడియో క్వాలిటీని పెంచడానికి ప్రొఫెషనల్ కెమెరా కొన్నది. ఓ వైపు యూట్యూబర్‌గా బిజీగా ఉన్నా చదువుకోవాలనే కోరికతో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.