పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా...బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం

పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా...బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం

 పశ్చిమ బెంగాల్ లో 206 సీట్లతో జెండా ఎగురవేసిన  బీజేపీ  మమతా బెనర్జీ కంచుకోటను  బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.  బీజేపీ మేనియాతో  తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమైంది. ఏకంగా సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీ కూడా ఓటమి చవి చూసింది.  అయితే ఓ సామాన్య గృహ కార్మికులు( పని మనిషి) శాసనసభలో అడుగుపెట్టి రికార్డు సృష్టించారు.  నెలకు కేవలం రూ. 2,500  సంపాదిస్తూ, ఇళ్లల్లో పని చేసే కలితా మాఝీ..  ఆస్‌గ్రామ్(sc) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై దేశవ్యాప్తంగా అందరి  దృష్టిని ఆకర్షించారు. 

నాలుగు ఇళ్లల్లో  పనిచేస్తూనే ప్రజా సమస్యలపై పోరాడారు. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయినా పట్టువదలకుండా ప్రజల్లోనే ఉన్నారు. ఫలితంగా ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగి లక్షా  ఏడు వేల 692 ఓట్లు సాధించి  ప్రత్యర్థి తృణమూల్ అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహర్‌ పై  12 వేల 535 ఓట్ల తేడాతో  విజయం సాధించారు.

రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ.. 206 స్థానాల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ప్రభంజనంలో కలితా మాఝీ విజయం అత్యంత ప్రత్యేకం. 1972 తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే మళ్ళీ బెంగాల్‌ను పాలించబోతుండటం ఒక ఎత్తైతే.. కలిత వంటి సామాన్యులు చట్టసభలకు ఎంపికవ్వడం మరో ఎత్తు.