
పట్టుదల ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించవచ్చు . అది ఏ రంగమైనా కావచ్చు . ఒకే మార్గాన్ని ఎంచుకోవల్సిన అవసరం లేదు. అనేక రంగాల్లోనూ రాణించవచ్చు . దీనిని నిరూపించి చూపించారు కాశిష్ మెత్వాని. అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేశారు. ఒకేసారి అనేక రంగాల్లో అద్భుతమైన విజయం సాధించి నేటి యువతకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు.
లేటెస్ట్ గా కాశిష్ మెత్వాని తన విజయ రహస్యాలను ఓ ఇంటర్యూలో పంచుకున్నారు. "జీవితంలో ఏదో ఒకటి ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు. నేను మరిన్ని అవకాశాలను కోరుకున్నాను. నేను మిస్ ఇండియా కావాలి, శాస్త్రవేత్త కావాలి, ఆర్మీ అధికారిణి కావాలి. ఒకే రంగంలో ఉండకుండా, అన్ని రంగాల్లోనూ రాణించాలనుకున్నాను. చివరికి అదే చేశాను, అదే సాధించాను" అని చెప్పుకొచ్చారు. మనసు మార్చుకుంటే చాలు విజయం మీ సొంతం అవుతుందన్నారు.
పుణేకు చెందిన కాశిష్ జీవితం చాలా అసాధారణమైనది. ఆమె ఒకవైపు అద్భుతమైన సూపర్‌మోడల్‌గా రాణించి, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 కిరీటం గెలుచుకున్నారు. అంతకుముందు ఆమె తన మేధస్సుతో సైన్స్ ప్రపంచంలో అడుగుపెట్టారు. సావిత్రీబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయం నుంచి MSC పట్టా పొందారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో న్యూరోసైన్స్ విభాగంలో ఎంఎస్సీ థీసిస్ సమర్పించారు. సైన్స్, ఫ్యాషన్... ఈ రెండు భిన్నమైన ప్రపంచాల్లోనూ అసాధారణ ప్రతిభ చూపిన కాశిష్.. ఇప్పుడు భారత సైన్యంలో ఒక అధికారిణిగా మూడో అడుగు వేశారు ..
సెప్టెంబర్ 6న జరిగిన తన పాసింగ్ అవుట్ పరేడ్‌తో భారత సైన్యంలోకి అధికారికంగా లెఫ్టినెంట్ హోదాలో కాశిష్ మెత్వాని అడుగుపెట్టారు. ఆమె ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD) వింగ్‌లో పనిచేయనున్నారు. ఈ విభాగాన్ని ఆమె స్వయంగా ఎంచుకోవడం విశేషం. ఇది ఒక క్లిష్టమైన, పోరాట విభాగం. ఈ విభాగంలో అత్యంత కచ్చితత్వం, సాంకేతిక నైపుణ్యం, ఒత్తిడిలోనూ ధైర్యంగా వ్యవహరించే సామర్థ్యం అవసరం. ఈ విభాగాన్ని ఎంచుకోవడం ద్వారా కాశిష్ తన ధైర్యం, సంకల్పాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
ALSO READ : ప్రపంచం అంతా H-1B గందరగోళం
ఆమె సాధించిన అద్భుతమైన విజయం వెనుక నిరంతర కృషి, అంకితభావం దాగి ఉన్నాయి. తన లక్ష్య సాధన కోసం ఆమె కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 2వ ర్యాంక్ సాధించి, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో (OTA) శిక్షణకు అర్హత పొందారు. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత పోటీపడతారు. అలాంటి అత్యంత కఠినమైన పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం ఆమె మేధస్సుకు నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాశిష్ మెత్వాని కేవలం ఒక అందాల రాణి కాదు, ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. ఒకేసారి అనేక కలలను వెంబడించి, వాటన్నిటినీ నిజం చేసుకోవచ్చని ఆమె నిరూపించారు. సామాజిక అంచనాలను పక్కన పెట్టి, తన సొంత మార్గాన్ని ఎంచుకున్న ఆమె ప్రయాణం ఎంతో మంది యువతకు ఆదర్శం. ఒక వ్యక్తికి అంతులేని సామర్థ్యం ఉంటుందని, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆమె జీవితం మనకు చెబుతుంది. లెఫ్టినెంట్ కాశిష్ మెత్వాని భవిష్యత్ తరాలకు ఒక జీవన పాఠం నిలుస్తుందని ప్రశంసలు అందుకుంటుంది.