
హైదరాబాద్, వెలుగు: సన్న బియ్యం ట్రాన్స్ పోర్టులో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈ పాస్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 28,623 ప్రభుత్వ స్కూళ్లకు ఆగస్టు 1 నుంచి ఈ-పాస్ ద్వారా మధ్యాహ్నం భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలోని 3,965 సంక్షేమ హాస్టళ్లలోని 8.76 లక్షల మంది స్టూడెంట్లకు, 28,623 ప్రభుత్వ పాఠాశాలల్లోని 23,87,751 మంది విద్యార్థులకు ప్రతి నెలా 12 వేల మెట్రిక్ టన్నులు, ఏడాదికి దాదాపు 1.20 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ప్రభుత్వం ట్రాన్స్ పోర్టు చేస్తోందన్నారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లలో ఈ-పాస్ విధానం అమలు చేస్తున్నామని, ఇకపై స్కూళ్లలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పాస్ ద్వారా ఏ రోజు, ఎంతమంది, ఎన్ని క్వింటాళ్ల బియ్యం తీసుళ్తున్నారు, ఇంకా ఎన్ని బియ్యం కావాల్సి ఉంది, ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలు పడుతుందన్నారు. ఈ ప్రక్రియను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.