ఇంధన ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 48 మంది మృతి చెందటంతో పాటు పదుల సంఖ్యలో మూగజీవాలు సజీవ దహనమైయ్యాయి. ఈ తీవ్ర విషాద ఘటన నైజీరియాలోని నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్లోని అగాయ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. నైజీరియా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా -అరబ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో ప్రయాణికులు, పశువులతో వెళ్తోన్న ఓ ట్రక్కు, ఇంధన ట్యాంకర్ పరస్పరం ఢీకొన్నాయి.
దీంతో భారీ పేలుడు సంభవించి.. 48 మంది ప్రయాణికులు మృత్యువాత పడగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కులోని మూగ జీవాలు మంటలకు సజీవదహనమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన చోటుకు చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతోన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు.