డొమినికాలో పట్టుబడ్డ మెహుల్ చోక్సీ

డొమినికాలో పట్టుబడ్డ మెహుల్ చోక్సీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNG) కు కోట్లాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయి...ఇటీవల కనిపించకుండా పోయిన వ్యాపార వేత్త మోహుల్‌ ఛోక్సీ ఆచూకీ లభించింది. కరేబియన్‌ దీవుల్లో ఒక చిన్న దీవి అయిన డొమినికాలో అరెస్టు చేశారు. క్యూబాకు పారిపోతుండగా చోక్సీని పట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన బోటు ద్వారా డొమినికా చేరుకున్నట్లు తెలుస్తోంది. అంటిగ్వా నుంచి ..ఛోక్సీ అదృశ్యం కావడంతో లూక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు అధికారులు. ఆ విషయాన్ని స్థానిక పోలీసులు గమనించి అరెస్టు చేశారు.

PNGకి రూ. 13,500 కోట్ల రుణాలను తీసుకుని ఎగ్గొట్టి...కరేబియన్‌లోని అంటిగ్వా, బార్బుడాకి పారిపోయాడు చోక్సీ. ఈ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఛోక్సీని అంటిగ్వా అధికారులకు అప్పగించనున్నారని.. ఆయన్ను పట్టుకున్నట్లు సీబీఐకి సమాచారం అందిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అంటిగ్వా నుండి పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలో అక్కడి కోర్టులో కేసు మరింత స్ట్రాంగ్‌ అవుతోందని.. త్వరలోనే భారత్‌కు అప్పగిస్తారని భావిస్తున్నట్లు తెలిపాయి.