నిరుద్యోగుల హామీలను నెరవేర్చండి .. సీఎం రేవంత్‌‌కు హరీశ్‌‌ రావు లేఖ

నిరుద్యోగుల హామీలను నెరవేర్చండి ..  సీఎం రేవంత్‌‌కు హరీశ్‌‌ రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుద్యోగులకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్‌‌ఎస్‌‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు డిమాండ్​ చేశారు. కాంగ్రెస్‌‌ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత.. ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితిని తెచ్చారని ఆయన విమర్శించారు. ఈ మేరకు గ్రూప్స్‌‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్‌‌ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆవేదనను కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని, కేబినెట్‌‌ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశామని ఆయన పేర్కొన్నారు. 

కానీ, అందరి ఆశలు అడియాశలు చేసేలా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్‌‌ సమావేశాన్ని ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్‌‌-–1 ఉద్యోగాలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2 లక్షల ఉద్యోగాలను గుర్తించి జాబ్‌‌ క్యాలెండర్‌‌ను ప్రకటించాలని డిమాండ్‌‌ చేశారు. నిరుద్యోగ భృతిని కూడా వెంటనే చెల్లించాలన్నారు. గ్రూప్–2కు 2వేల ఉద్యోగాలు, గ్రూప్–3 కి  3వేల ఉద్యోగాలు  కలుపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని, ఒత్తిడికి గురవుతున్నారని హరీశ్‌‌ పేర్కొన్నారు.