బాటసింగారం మామిడి బంగారం!..టన్ను ధర రూ. లక్షన్నర వరకు!

బాటసింగారం మామిడి బంగారం!..టన్ను ధర రూ. లక్షన్నర వరకు!

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన బాటసింగారం మార్కెట్​లో మామిడి విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్​లో రకాన్ని బట్టి టన్ను మామిడి ధర రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు పలుకుతోంది. 

ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి వస్తున్న పేపర్ బంగినపల్లికి అధిక గిరాకీ ఉండగా, టన్ను రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు ధర పలుకుతున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ తెలిపారు. ఏపీ, కర్నాటక, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి దిగుమతులు వస్తున్నాయని, గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి కొంత తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, అయితే రాబోయే రోజుల్లో దిగుబడి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు అకాల వర్షాల ప్రభావం పంటపై పడితే ధరల్లో మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.