పాలు, గుడ్లకు  మస్తు డిమాండ్

పాలు, గుడ్లకు  మస్తు డిమాండ్

సెకండ్​వేవ్​లో పెరిగిన వాడకం
గతేడాదితో పోలిస్తే గ్రేటర్ లో 20 శాతం ఎక్కువగా అమ్మకాలు

హైదరాబాద్, వెలుగు : కరోనాతో ప్రొటీన్ ఫుడ్ కు సిటీ జనం ఇంపార్టెన్స్  ఇస్తుండడంతో పాలు, గుడ్లకు డిమాండ్ పెరిగింది.   సెకండ్​ వేవ్​  కారణంగా ఈఏడాది  మార్చి నుంచి గ్రేటర్​లో పాలు, గుడ్లను డైలీ డైట్ లో భాగంగా తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కు వైంది.  ప్రస్తుతం  కుటుంబాలు  వారంలో 5 రోజులు   ఫుడ్​లో  గుడ్డు ఉండేలా చూసుకుంటున్నాయి. 
డైలీ 45 లక్షల గుడ్లు సేల్
గ్రేటర్​ లోని 22 లక్షల కుటుంబాలు వారానికి 5 రోజుల పాటు గుడ్డును తింటున్నట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెప్తున్నారు.  కరోనా కంటే ముందు రాష్ట్రంలో రోజుకి 4 కోట్ల ఉత్పత్తి జరిగితే అందులో తెలంగాణ వ్యాప్తంగా కోటి 50 లక్షల నుంచి 2 కోట్ల గుడ్లను వాడేవారు. ఒక్క గ్రేటర్ లోనే కరోనాకు ముందు వరకు డైలీ 55 నుంచి 60 లక్షల గుడ్ల వాడకం ఉండేది.  మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు.  గతేడాది కరోనా ఫస్ట్​ వేవ్​లో గ్రేటర్​లో గుడ్ల వాడకం 40 లక్షలకు పడిపోయింది. కానీ సెకండ్ ​వేవ్​తో మళ్లీ డిమాండ్ పెరిగిందని, గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం డైలీ 45 నుంచి 50 లక్షల గుడ్లు అమ్ముడవుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. ఈసారి గ్రేటర్ లో గుడ్ల వాడకం 6 నుంచి 8 లక్షలు పెరిగినట్లు ఎగ్ డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ప్రస్తుతం హోల్ సేల్ లో ఒక్క గుడ్డు ధర  రూ4. 90 ఉండగా, రిటైల్ లో  రూ. 6 నుంచి రూ.6.50కు  అమ్ముతున్నారు.
20 లక్షల లీటర్ల పాల అమ్మకాలు
గ్రేటర్ లో ప్రస్తుతం డైలీ సుమారు 20 లక్షల లీటర్ల పాల అమ్మకాలు  జరుగుతున్నాయి. లాక్​డౌన్​తో ఇరానీ కేఫ్​లు, టీ స్టాల్స్, రెస్టారెంట్లకు పాల సప్లయ్ భారీగా తగ్గింది. ఈ క్రమంలో ఇండ్లల్లో పాల వాడకం భారీగా పెరిగింది. గ్రేటర్​లో డైలీ అమ్ముడవుతున్న పాలలో 60 శాతానికి మించి ఇండ్లలోనే వాడుతున్నారు.  దీంతో గతంతో పోలిస్తే 3 లక్షల లీటర్లు అదనంగా అమ్ముతున్నట్లు పాల ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు.  పన్నీర్, లస్సీ, స్వీట్లు, బట్టర్ లాంటి ప్రొడక్ట్స్ కు గిరాకీ లేదని మలక్ పేట్ కు చెందిన డెయిరీ డిస్ట్రిబ్యూటర్ మోహన్ రెడ్డి చెప్పారు. సిటీలో పాలు, గుడ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న టైమ్​లో  లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్  పోర్టు కు ఇబ్బందిగా మారిందని పాల, పౌల్ట్రీ వ్యాపారులు చెప్తున్నారు.