తెలంగాణ సెప్టెంబర్ 17 హిస్టరీ: ఆ 5 రోజుల్లో ఏం జరిగింది.. ఇండియాలో హైదరాబాద్ విలీనం ఎలా అయ్యింది..?

తెలంగాణ సెప్టెంబర్ 17 హిస్టరీ: ఆ 5 రోజుల్లో ఏం జరిగింది.. ఇండియాలో హైదరాబాద్ విలీనం ఎలా అయ్యింది..?

1947, ఆగస్ట్ 15న భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలన ముగిసింది. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోతూ బ్రిటిష్ ఇండియా పాలనలో ఉన్న భూభాగాన్ని పాలించే అధికారాన్ని భారతీయులకే అప్పగించారు. సంస్థానాల భవిష్యత్‏ను వాటి ఇష్టానికే వదిలేశారు. అయిదు వందలకు పైగా సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాయి. హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ సంస్థానాలు మాత్రం స్వతంత్రంగానే ఉండాలనుకున్నాయి. హైదరాబాద్‎ని ఇండియాలో ఎలా కలుపుకోవాలనే విషయం మీద భారత ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది. నిజాంని లొంగదీసుకోవాలా..? లేక నిజాం రాజ్యాన్ని ఆక్రమించుకోవాలా..? అని తేలడానికి కొంత సమయం పట్టింది.

భారత పత్రికల్లో హైదరాబాద్ దక్కన్‎లో రజాకార్లు, కమ్యూనిస్టులు ఆరాచకాలు చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భారత ప్రభుత్వం సైనిక చర్య తీసుకుంటుందనే అనుమానం రావడంతో చివరి ప్రయత్నాలు కూడా చేసింది. నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల ప్రాణాలకు హాని లేదని, ప్రభుత్వం ఏ మతస్థులను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టదని, అందరి ప్రాణాలను కాపాడే బాధ్యత నిర్వర్తిస్తుందని చెబుతూ మద్రాస్, బొంబాయి, సెంట్రల్ ప్రావిన్స్ ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రధానమంత్రి లేఖ రాసిండు. ప్రావిన్స్ ముఖ్యమంత్రి, హోం మంత్రితో కలిసి హైదరాబాద్ పర్యటించాలని హైదరాబాద్ దక్కన్ ప్రధానమంత్రి లాయక్ అలీ ఆహ్వానించిండు.

ఆహ్వానానికి మద్రాస్, సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్యమంతులు సానుకూలంగా స్పందించారు. అయితే. భారత గవర్నమెంట్ ప్రతినిధి జనరల్ కేఎం మున్షీ పావులు కదిపి వాళ్లను వెనక్కితగ్గేలా చేసిండు. కొద్ది నెలలకే జనవరి 5, 1948న హైదరాబాద్ దక్కన్‎కి ప్రతినిధి జనరల్ (హైదరాబాద్లో ఇండియా రాయబారి)గా మున్షీని ఇండియా గవర్నమెంట్ నియమించింది. ఈ పరిస్థితుల్లో నిజాం ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా చత్తారీ ఈ పరిస్థితుల్లో రాజీనామా చేసిండు. ఒకపక్క రైతు సంఘాలు గ్రామాల్లో పట్టు సంపాదించాయి.  మరోపక్క హైదరాబాద్లో రజాకార్లు చెలరేగిపోతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో భారత ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తేవడానికి పూనుకుంది.

సెప్టెంబరు 13, 1948 (మొదటి రోజు)

ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ ఆదేశాలతో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ దక్కన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైన్యం ఉదయం బయలుదేరింది. హైదరాబాద్ రాజ్యానికి నలు వైపుల నుంచి రాజ్యాన్ని భారత ఆర్మీ చుట్టుముట్టింది. యుద్ధ ట్యాంకులతో సరిహద్దులు దాటి, లోపలికి ప్రవేశించాయి. వరంగల్, బీదర్, రాయచూర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్ వైమానిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్పోర్స్ బాంబులు కురిపించింది.

సెప్టెంబరు 14 (రెండో రోజు)

నిజాం సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన లేకుండానే ఇండియన్ ఆర్మీ అన్ని వైపుల నుంచి ముందుకు దూసుకుపోతోంది. ఉదయానికి ఔరంగాబాద్ పట్టణాన్ని భారత సైన్యం చేజిక్కించుకుంది. నిజాం నిరాశలో ఉన్నాడు. ఆయన్ని కలిసేందుకు వచ్చిన ప్రధానమంత్రిని చూసి ఉస్మాన్ అలీఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బీదర్, జాల్నా పట్టణాలను భారత సైన్యం ముట్టడించింది. తూర్పు నుంచి చొచ్చుకు వస్తున్న భారత సైన్యాన్ని నిలువరించడానికి వైరా, పాలేరు రిజర్వాయర్ల గేట్లు ఎత్తాలని, దిగువభాగంలో కాలువల కట్టలు తెంచాలని ప్రధాన మంత్రి లాయక్ అలీ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చిండు. వాళ్లు చెప్పినట్లే చేశారు. 

నల్లరేగడి నేలలు బురదమయం కావడంతో భారత సైనికులు నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వాహనాలు రాలేకపోయాయి. ఇప్పుడు అనుకూలంగా ఉన్న హుజూరాబాద్- మిర్యాలగూడ దారిగుండా ఇండియన్ ఆర్మీ మూసీ కాలువను దాటింది. ఆ దళాలను నిలువరించడానికి సూర్యాపేట నకిరేకల్ దారిలో మూసీపై ఉన్న వంతెనని నిజాం ప్రభుత్వం కూల్చివేసింది. మూసీని దాటి రాకుండా వరద పెంచాలని హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు.

ఆ రోజు రాత్రి ఆర్మీ హెడ్ క్వార్టర్స్‎కి కాశిం రజ్వీ మొదటిసారిగా వచ్చిండు. దక్షిణ, తూర్పు ప్రాంతాలలో యుద్ధానికి పంపడానికి రజాకార్లు కావాలని ప్రధాన మంత్రి ఆయన్ని కోరిండు. 'ఎంత మంది కావాలంటే అంత మందిని పంపిస్తా'నని రజ్వీ చెప్పిండు. వెంటనే హైదరాబాద్ సిటీలో పర్యటించిన రజ్వీ నాలుగు బెటాలియన్లకు సమానమైన వలంటీర్లను సిద్ధం చేసిండు. నిజాం ప్రభుత్వ కేబినేట్ సమావేశం జరిగింది. 

హైదరాబాద్ రాజ్యాన్ని భారత సైన్యం ఆక్రమించుకోకుండా నిలువరించలేమని అర్థమైపోయి కనీసం హైదరాబాద్ నగరాన్ని అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో పడింది నిజాంప్రభుత్వం. అయితే, ఈ కేబినేట్ సమావేశం ముగిసే సమయానికి భారత సైన్యం బీదర్ సమీపానికి వచ్చిందని దక్కన్ రేడియోలో వార్త ప్రసారమైంది. కల్యాణి - బీదర్ దారిలో భారత సైన్యం వేగంగా దూసుకువస్తున్నట్లు ఆర్మీ కమాండర్ ప్రధాన మంత్రికి ఫోన్ చేసి చెప్పిండు. ఆర్మీ కమాండర్‎కి ఆశలు సన్నగిల్లాయి. నిజాంకి కూడా ఆశల్లేవు.

 సెప్టెంబరు 15 (మూడవ రోజు)

హైదరాబాద్ దక్కన్ పశ్చిమ భాగం ఇండియన్ యూనియన్ సైన్యాల వశమైంది. ఆపరేషన్ పోలోలో పాల్గొన్న ప్రధాన దళం దాలం నుంచి కల్యాణి పట్టణానికి చేరింది. భారత సైన్యం బీదరు ఆక్రమించుకున్నట్లుగా ఆల్ ఇండియా రేడియో ప్రకటించింది. సైన్యం కల్యాణి - బీదర్ మీదుగా వస్తున్నట్లుగా సమాచారం అందిందని ప్రధాన మంత్రికి కబురు వచ్చింది. అప్పటి మ్యాప్లో ఆ రోడ్డు లేదు. అది ఎలా సాధ్యమంటూ అప్పటి రోడ్ల చీఫ్ ఇంజినీరికి ప్రధాన మంత్రి ఫోన్ చేసిండు. 

ఈ మధ్యే రోడ్డు వేశామని ఆయన చెప్పిండు. ఆ రోడ్డు ఉన్నట్లు కమాండర్‎కు తెలియదు. ఇంటెలిజెన్స్ వారికీ తెలియదు కానీ భారత సైన్యం మాత్రం దాని గురించి తెలుసుకుందని అర్ధం కాక నిజాం ప్రభుత్వం తలపట్టుకుంది. చేసేదేమి లేక సైన్యాన్ని జహీరాబాద్ దగ్గర మోహరించారు. హైదరాబాద్కు వేగంగా చేరుకోకుండా అడ్డుకోవాలన్నది వ్యూహం. కానీ, అప్పటికే పరిస్థితులన్నీ చేయిదాటిపోతున్నాయి.

సెప్టెంబరు 16 (నాలుగో రోజు)

బీదర్లో ఉన్న ఇండియన్ ఆర్మీ జహీరాబాద్ వైపుకు కదిలింది. భారత సైన్యం అన్నివైపుల నుంచి దూసుకువస్తుంది. హైదరాబాద్ సైన్యం నిస్సహాయంగా ఉంది. రాత్రి ప్రధాన మంత్రి నిజాంని కలిసిండు. ఇప్పుడు రెండు మార్గాలున్నట్లుగా వాళ్ల మధ్య చర్చకు వచ్చింది. నిజాం తప్పుకుని మంత్రి మండలికీ పాలన అప్పగించడం లేదా మంత్రి మండలిని రద్దు చేసి ఇండియాతో ఒప్పందం చేసుకోవడం. వీటిలో ఏది ఎంచుకున్నారని ప్రధాని అడిగితే రేపు పొద్దున తొమ్మిది గంటలకు చెబుతానని నిజాం అనడంతో ఆ సమావేశం ముగిసింది.

మంత్రి మండలి రాజీనామా

హైదరాబాద్ కేబినెట్ సమావేశమైంది. మంత్రి మండలి రాజీనామా చేసింది. దానిని నిజాం అంగీకరించిండు. అదే రోజు మధ్యాహ్నం లాయక్ అలీ డక్కన్ రేడియో కేంద్రానికి చేరుకుని హైదరాబాద్ రాజ్య స్వతంత్ర్యాన్ని కాపాడలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేసిండు.

సెప్టెంబరు 17 (ఐదో రోజు)

భారత సైన్యం హైదరాబాద్కు 30 మైళ్ల దూరంలో బీబీ నగర్‎కు చేరుకుంది. భారత సైన్యానికి లొంగిపోవాలని నిజాం నిర్ణయించుకున్నాడు. తాను లొంగిపోతున్నట్లు రేడియోలో ప్రకటించాడు. ఆ తర్వాత రెసిడెంట్ జనరల్ మున్షీ రేడియోలో ప్రకటన చేసిండు. పాత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కొత్త పాలకులు సరిదిద్దుతారన్నది దాని సారాంశం.

సైనికాధికారికి పట్టాభిషేకం

సెప్టెంబరు 18న బొల్లారంలోని రెసిడెన్సీలో సందడి నెలకొంది. ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ చౌదరికి ఘనంగా స్వాగతం పలికారు. బొల్లారంలోని రెసిడెన్సీపై ఇండియా పతాకం ఎగిరించి ఆ తర్వాత చౌదరి ఆధ్వర్యంలో మిలటరీ పాలన ప్రారంభమైంది. సెప్టెంబరు 19 నాటికి అన్ని దిక్కుల నుండి ప్రవేశించిన సైన్యాలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఆ తర్వాత చౌదరి మిలటరీ పాలనను రద్దు చేసి సివిల్ సర్వెంట్ వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణా రావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిండు.

రాజ్ ప్రముఖ్ పేరుతో నిజాం రాజు

17 సెప్టెంబరు 1948న జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత నిజాం పాలన అంతమయింది. హైదరాబాద్ దక్కన్ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత ఉస్మాన్ అలీఖాన్ కు రాజప్రముఖ్ హోదా ఇచ్చారు.