T20 World Cup 2024: ఆ రోజే ఫైనల్ మ్యాచ్..టీ20 ప్రపంచ కప్ పూర్తి వివరాలు ప్రకటించిన ఐసీసీ

T20 World Cup 2024: ఆ రోజే ఫైనల్ మ్యాచ్..టీ20 ప్రపంచ కప్ పూర్తి వివరాలు ప్రకటించిన ఐసీసీ

2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కాకుండానే అప్పుడే ఐసీసీ 2024 టీ 20 ప్రపంచ కప్ వివరాలు అందించే పనిలో ఉంది. ఇందులో భాగంగా  జూన్ 4 నుండి 30 వరకు ICC పురుషుల T20 ప్రపంచ కప్ జరుగబోతున్నట్లు ధ్రువీకరించింది. కరేబియన్‌లోని ఆంటిగ్వా & బార్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ & టొబాగో, USAలోని డల్లాస్, ఫ్లోరిడా మరియు న్యూయార్క్ మ్యాచులకి ఆతిధ్యమివ్వనున్నాయి.  

కాగా.. అమెరికాలో T20 ప్రపంచ కప్ ఆడటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్  జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ "20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ఆతిధ్యమిచ్చే ఏడు కరేబియన్ వేదికలను ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఇది వెస్టిండీస్ హోస్ట్ చేసే మూడవ ICC సీనియర్ పురుషుల ఈవెంట్. అభిమానులకి ఈ మ్యాచులు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి". అని పేర్కొన్నాడు.

  
ఇక ఈ పొట్టి సమరం కోసం ఆతిధ్య దేశాలైన అమెరికా,వెస్టిండీస్ తో పాటు ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే అర్హత సాధించాయి.మరో 8 జట్లు క్వాలిఫై మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది.