ఆయకట్టుకు పూర్తి స్థాయిలో పక్కాగా నీళ్లు

ఆయకట్టుకు పూర్తి స్థాయిలో పక్కాగా నీళ్లు

వానాకాలం పంటలకు పూర్తిగా అందే చాన్స్

భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఫుల్

ఈసారి సింగూరుకు ఆశాజనకంగా వరద

హైదరాబాద్‌‌, వెలుగు:  కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నీ ఫుల్​ కావడంతో ఈసారి వానాకాలం పంటలతో పాటు యాసంగికి పూర్తి స్థాయిలో నీళ్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివమ్‌‌ కమిటీ ప్రతిపాదించిన 41 లక్షల ఎకరాలకు పూర్తిగా నీళ్లు అందుతాయని ఇరిగేషన్‌‌ అధికారులు చెప్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌‌లోని ప్రాజెక్టులు మూడోసారి సర్‌‌ప్లస్‌‌ అవుతుండగా, గోదావరి బేసిన్‌‌లోని ప్రాజెక్టులు పది రోజుల క్రితమే పూర్తిగా నిండాయి. మంజీరాలోనూ భారీ వరదలు వస్తుండటంతో సింగూరు ప్రాజెక్టు సగానికిపైగా నిండింది. మరో విడత వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుండటంతో ఈసారి సింగూరు, నిజాంసాగర్‌‌ పూర్తిగా నిండే అవకాశముందని ఇంజనీర్లు చెప్తున్నారు.

ఆగస్టులోనే ప్రాజెక్టులు ఫుల్

కృష్ణా బేసిన్‌‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టులు ఆగస్టులోనే పూర్తిగా నిండాయి. జూరాల కుడి, ఎడమ కాలువ ఆయకట్టుతోపాటు భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌ లిఫ్ట్‌‌ల కింద 4,62,962 ఎకరాలకు వానాకాలం పంటలకు పూర్తి స్థాయిలో నీళ్లు అందనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుపై నిర్మించిన కల్వకుర్తి మోటార్లను పూర్తిగా నడుపకున్నా ప్రాజెక్టులో ఉన్న నీళ్లతో 3,41,359 ఎకరాలకు నీళ్లు అందే అవకాశముంది. యాసంగిలో 2 లక్షల ఎకరాలకుపైగా కల్వకుర్తి కింద నీళ్లు ఇచ్చే అవకాశముంది. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ ఆయకట్టు 6.30 లక్షల ఎకరాలతో పాటు ఏఎమ్మార్పీ కింద 2.63 లక్షల ఎకరాలకు నీటికి భరోసా దక్కింది.

మరికొన్ని రోజులు వరద

గోదావరి బేసిన్​లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో స్టేజ్‌‌-1 పరిధిలో 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్‌‌-2 కింద 4 లక్షల ఎకరాలతో పాటు అలీసాగర్‌‌, గుత్ప, చౌట్‌‌పల్లి హన్మంతరెడ్డి, ఐడీసీ లిఫ్ట్‌‌ల కింద 2.50 లక్షల ఎకరాలకు వానాకాలంలో నీళ్లు అందనున్నాయి. మరికొన్ని రోజులు వరద కొనసాగే అవకాశముండటంతో ఎల్‌‌ఎండీ ఎగువ ఉన్న 5 లక్షల ఎకరాలకు యాసంగిలోనూ నీళ్లు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎల్‌‌ఎండీ కింద ఎస్సారెస్పీ స్టేజ్‌‌-1, స్టేజ్‌‌-2 ఆయకట్టుకు నీటి సమస్య లేకుండా పోయింది. మిడ్‌‌ మానేరు కింద ప్రతిపాదించిన 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందడంతో పాటు ఎల్‌‌ఎండీ కింది ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఈ రిజర్వాయర్‌‌లో నిల్వ ఉన్న నీళ్లు ఉపయోగపడనున్నాయి. నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఈ వానాకాలంలో సింగూరుతోపాటు నిజాంసాగర్‌‌ కింద ప్రతిపాదించిన 92 వేల ఎకరాలకు పక్కాగా నీళ్లు అందనున్నాయి. మీడియం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో వాటి కింద పేర్కొన్న 3.24 లక్షల ఎకరాలు, ఐడీసీ స్కీంల కింద ప్రతిపాదించిన 1.30 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీళ్లు అందుతాయని ఇరిగేషన్‌‌ అధికారులు చెప్తున్నారు.