
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ మంగళవారం ప్రారంభం కాగా.. ఫస్ట్ డే వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాత్రి 7 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని.. ఫైన్ కింద రూ.5 కోట్ల 50 లక్షలు వసూలైనట్లు చెప్పారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్, మీ సేవా సెంటర్ల ద్వారా వాహనదారులు చలాన్లను క్లియర్ చేశారన్నారు. ఫస్ట్ డే చాలా మంది వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ఒక్కసారిగా ఈ– చలాన్ వెబ్ సైట్లు ఓపెన్ చేయడంతో సర్వర్ డౌన్ అయ్యి పేమెంట్ గేట్ వేలో సమస్యలు వచ్చాయి. సర్వర్లు నెమ్మదిగా రన్ అవుతుండటంతో కెపాసిటీని 10 రెట్లు పెంచామని సిటీ ట్రాఫిక్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల లిమిట్స్‌లో సుమారు 80 శాతం చలాన్లు క్లియర్ అయ్యాయని చెప్పారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆఫర్ నెల రోజుల వరకు కొనసాగుతుందన్నారు. ఈ – చలాన్ సైట్‌లో వెహికల్ నంబర్, ఇంజిన్ నంబర్ తప్పనిసరి చేశామన్నారు. ఇంజిన్ నంబర్‌లోని చివరి 4 నంబర్లను ఎంటర్ చేయాలన్నారు.