ఈ సారి మేడారం జాతరకు ఫుల్​రష్..మహిళలకు ఫ్రీ బస్సు జర్నీతో పెరగనున్న భక్తులు..

ఈ సారి మేడారం జాతరకు ఫుల్​రష్..మహిళలకు ఫ్రీ బస్సు జర్నీతో పెరగనున్న భక్తులు..
  •     ప్రతి జాతరకు తరలివస్తున్న 20 లక్షల మంది  
  •     మరో 10 లక్షలు పెరిగే అవకాశం
  •     గతంలో 3 వేల బస్సులు నడిపిన ఆర్టీసీ
  •     ఇప్పుడు 5 వేలు నడపాల్సి రావచ్చంటున్న ఆఫీసర్లు
  •     మేడారంలో పనులు మొదలుపెట్టిన టీఎస్​ఆర్టీసీ 

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : ఈసారి ఆర్టీసీ బస్సుల్లో మేడారం వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మహాలక్ష్మీ స్కీంతో మహిళలు, బాలికలకు పల్లెవెలుగు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సుల్లో ఫ్రీ జర్నీకి అవకాశం ఉండడమే దీనికి కారణం. ప్రతి రెండేండ్లకోసారి జరిగే మహా జాతరకు సుమారు 20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో మేడారం చేరుకునేవాళ్లు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల బస్సులు నడిపించేటోళ్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ స్కీంతో ఈ సారి సుమారు 30 లక్షల మంది భక్తులు బస్సుల్లో మేడారం వస్తారని ఆర్టీసీ అంచనా వేస్తోంది. దీనికోసం 5 వేల వరకు బస్సులు నడపాల్సి వస్తుందని భావిస్తోంది. జాతరకు రెండు నెలలే ఉండడంతో ఇప్పటికే ఆదివారం, ఇతర సెలవు దినాల్లో మేడారం ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. హన్మకొండ బస్‌‌ స్టేషన్‌‌ నుంచి ప్రతి ఆదివారం 10 బస్సులు ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు కేటాయించింది. దీంతో టెండర్లు కంప్లీట్‌‌ చేసిన ఆఫీసర్లు మేడారంలో పనులు మొదలుపెట్టారు.  

వీవీఐపీ వాహనాలు, ఆర్టీసీ బస్సులది..ఒకే రూట్‌‌

నాలుగు రోజుల పాటు జరగనున్న మహాజాతరకు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ప్రైవేట్‌‌, సొంత వాహనాలల్లో వచ్చే భక్తులను పస్రా, చిన్నబోయినపల్లి, కాటారం నుంచి మేడారానికి అనుమతిస్తారు. ఈ రూట్లలో వచ్చే వాహనాలను గద్దెలకు చాలా దూరంలో నిలిపివేస్తారు. ఇక్కడి నుంచి కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. వృద్ధులు, పిల్లలయితే చాలా ఇబ్బందులు పడతారు. తిరిగి వెళ్లేటప్పుడు నార్లాపూర్‌‌, కమలాపూర్‌‌ క్రాస్‌‌‌ మీదుగా ప్రయాణించాలి. ఈ రూట్​లో సుమారు 50 కిలోమీటర్లు అదనంగా జర్నీ చేయాల్సి ఉంటుంది. అదే వీఐపీ, వీవీఐపీ వెహికల్స్‌‌ తాడ్వాయి మీదుగా గద్దెలకు అతి సమీపంలోకి వెళ్తాయి. ఈ మార్గంలోనే ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతారు. వీఐపీలతో పాటుగా ప్రయాణించే సౌకర్యం కేవలం ఆర్టీసీ ప్రయాణికులకు మాత్రమే ఉంటుంది. గద్దెలకు కేవలం కిలోమీటర్​ దూరంలోనే బస్టాండ్‌‌ ఉంటుంది కాబట్టి ప్రయాణికులంతా ఇక్కడే దిగి దర్శనానికి వెళ్తారు. తిరిగి ఈ బస్టాండ్​కే వస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులు దొరుకుతాయి. దీంతో ఈసారి ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే 50 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.  

5 వేల బస్సులు అవసరం

2018, 2020, 2022 మహా జాతరల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల బస్సుల ద్వారా 17 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులను మేడారం తీసుకొచ్చారు. వరంగల్‌‌, కరీంనగర్‌‌, ఖమ్మం,రంగారెడ్డి, ఆదిలాబాద్‌‌ రీజియన్ల పరిధిలో 51 సెంటర్లను ఏర్పాటు చేసి భక్తులను మేడారం తరలించారు. అయితే, ఈసారి పల్లెవెలుగు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం ఉండడంతో 30 లక్షల మంది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల బస్సులను తిప్పాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులు తెప్పించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

మేడారంలో ఆర్టీసీ ఏర్పాట్లు షురూ

మహాజాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.2.25 కోట్లను కేటాయించడంతో వరంగల్‌‌ రీజియన్‌‌ నుంచి టెండర్ల ప్రక్రియ కంప్లీట్‌‌ చేశారు. మేడారంలో కూడా పనులు మొదలుపెట్టారు. మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌‌ స్టేషన్‌‌ ఏర్పాటు చేస్తున్నారు. 25 ఎకరాల్లో బస్సుల పార్కింగ్‌‌, మరో 25 ఎకరాల్లో టికెట్‌‌ కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు నిర్మిస్తున్నారు. తాగునీరు, లైటింగ్‌‌ సౌకర్యం, కమాండ్‌‌ కంట్రోల్‌‌ రూం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పొడవాటి క్యూలైన్లు నిర్మిస్తున్నారు. ఆర్టీసీ అలైటింగ్‌‌, బోర్డింగ్‌‌ పాయింట్ల వద్ద 40 సీసీ కెమెరాలను అమరుస్తున్నారు. ఆర్టీసీ కంట్రోల్‌‌ రూం ద్వారా పోలీసు, రెవెన్యూ ఆఫీసర్ల కమాండ్‌‌ కంట్రోల్‌‌ రూంలకు అనుసంధానం చేసే పనులు మొదలుపెట్టారు. జాతర విధుల్లో పాల్గొనే బస్‌‌ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది కోసం కోసం టెంపరరీ విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తాత్కాలిక భోజనశాల నిర్మిస్తున్నారు. 

మేడారానికి బస్సులు నడుపుతున్నం‌!

మేడారం జాతర కోసం ఈ సారి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కన్పిస్తోంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2.25 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు కంప్లీట్‌‌ చేసి మేడారంలో పనులు మొదలుపెట్టినం. జాతర కోసం ముందస్తుగా వెళ్లే భక్తుల సౌకర్యార్ధం హన్మకొండ బస్టాండ్‌‌లో ప్రతి ఆదివారం, సెలవుదినాల్లో 10 బస్సులు నడిపిస్తున్నాం. ఇంకా అవసరమైతే మరిన్ని బస్సులు నడుపుతాం.
‒ శ్రీలత, ఆర్టీసీ ఆర్‌‌ఎం, వరంగల్‌‌ రీజియన్‌‌