రిజర్వాయర్లలో ఫుల్లు నీళ్లు .. సిటీకి తాగునీళ్లందిస్తున్న జలాశయాల్లో జలకళ

రిజర్వాయర్లలో ఫుల్లు నీళ్లు .. సిటీకి తాగునీళ్లందిస్తున్న జలాశయాల్లో జలకళ
  • 521 అడుగులకు చేరుకున్న ‘సాగర్’​
  • 468 అడుగుల వద్ద ‘ఎల్లంపల్లి’  
  • అనుకున్న సమయానికంటే ముందే నిండుతాయంటున్న అధికారులు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్​ హైదరాబాద్​ నగరానికి తాగునీటిని అందిస్తున్న రిజర్వాయర్లలోకి భారీగా వరద చేరుతోంది. నిండుకుండల్లా కనిపిస్తుండడంతో నగరానికి నీటి కష్టాలు పెద్దగా ఉండవని వాటర్​బోర్డు అధికారులు చెప్తున్నారు. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఎక్కువ క్యాచ్​మెంట్​ఏరియా ఉండడంతో కృష్ణాజలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. దీంతో పాటు గోదావరి జలాలు కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్​లోకి వస్తున్నాయి.

ముందే జలకళ

గ్రేటర్​పరిధిలోని దాదాపు కోటిన్నర జనాభాకు తాగునీటిని సరఫరా చేస్తున్న వాటర్​బోర్డు ప్రధాన రిజర్వాయర్లయిన నాగార్జున సాగర్, ఎల్లంపల్లితోపాటు మరికొన్ని జలాశయాల ద్వారా నీటిని అందిస్తోంది. నెల కింద వేసవి సందర్భంగా భారీ ఎండల కారణంగా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు, డిమాండ్​ అధికంగా ఉండడంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వెస్ట్​సిటీలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో భారీ సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి వచ్చింది.

 నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాగునీటి సమస్య తగ్గుముఖం పట్టింది. జలాశయాల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. 

నగరంలో రోజుకు 550 ఎంజీడీల నీటిని సరఫరా చేసినా చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో జలాశయాలు అనుకున్న సమయానికన్నా ముందే నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాలతోనే ప్రధాన జలాశయాలు నిండుతుంటాయి. కానీ, ఇప్పుడు జూలై నాటికే ప్రధాన రిజర్వాయర్లలో రెండు నుంచి మూడు అడుగుల మేర నీటి నిల్వలు పెరిగినట్టు అధికారులు తెలిపారు. 

వరద నీరు వచ్చి చేరిందిలా..

నగరానికి నీటి  సరఫరా చేసే ప్రధాన జలాశయాల్లో నాగార్జున సాగర్​నుంచి మూడు దశల ద్వారా కృష్ణా జలాలు రోజుకు 275 ఎంజీడీలను సరఫరా చేస్తున్నారు. వేసవిలో నాగార్జున సాగర్​లో నిల్వలు పడి పోయాయి. సాగర్​ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, తాజాగా ఈ జలాశయంలోకి 4.282 టీఎంసీల నీరు వచ్చి చేరి 521 అడుగులకు చేరుకుంది. 

గోదావరి జలాలు సరఫరా చేసే ఎల్లంపల్లి రిజర్వాయర్​లోకి కూడా వరద ప్రారంభమైంది. శుక్రవారం నాటికి 0.068 టీఎంసీల నీరు అంటే దాదాపు 2 అడుగుల మేర చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ రిజర్వాయర్​నుంచి గోదావరి మొదటి దశ ప్రాజెక్టు ద్వారా రోజుకు 163 ఎంజీడీలను నగరానికి సరఫరా చేస్తున్నారు. దీని పూర్తి సామర్థ్యం 485 అడుగులు కాగా ప్రస్తుతం 468 అడుగులకు చేరింది. సింగూరు నుంచి కూడా నగరానికి రోజుకు 69 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. వారం రోజుల వర్షం వల్ల దాదాపు రెండు అడుగుల నీరు వచ్చి చేరిందని అధికారులు చెప్తున్నారు. సింగూరు పూర్తి సామర్థ్యం 1,717 అడుగులు కాగా, ప్రస్తుతం 1,709 అడుగులకు చేరింది. 

మంజీరా నుంచి కూడా రోజుకు 40 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ జలాశయంలోకి 0.220 టీఎంసీల నీరు వచ్చిందని అధికారులు తెలిపారు. మంజీరా పూర్తి సామర్థ్యం 1,651 అడుగులు కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో 1,647 అడుగుల మేర నీరు ఉంది. జంట జలాశయాలైన ఉస్మాన్​ సాగర్​పూర్తి కెపాసిటీ 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,782అడుగులు ఉంది. ఈ జలాశయం నుంచి రోజుకు 22.50 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో అడుగుమేర నీరు వచ్చినట్టు అధికారులు తెలిపారు. 

హిమాయత్​ సాగర్​ పూర్తి కెపాసిటీ 1,763 అడుగులు కాగా, ప్రస్తుతం1,758 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి రోజుకు 10.58 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో 0.002 టీఎంసీల నీరు అంటే దాదాపు అడుగున్న మేరకు నీరు చేరినట్టు తెలిపారు.