భారీ వర్షాలు.. ప్రాజెక్టులలో జలకళ

భారీ వర్షాలు.. ప్రాజెక్టులలో జలకళ
  • ప్రాజెక్టులు నిండుతున్నయ్
  • గోదావరి బేసిన్‌లో జలకళ..
  • సగం నిండిన ఎస్సారెస్పీ.. 48 టీఎంసీల నీటి నిల్వ
  • దాదాపు నిండిన ఎల్లంపల్లి.. గేట్లు ఎత్తే చాన్స్ 
  • కాళేశ్వరం బ్యారేజీలన్నీ ఫుల్ 
  • రాష్ట్రమంతటా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. గోదావరి బేసిన్‌లో  రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీకి వరద భారీగా వస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 92 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 48 టీఎంసీల నీళ్లు చేరాయి. బుధవారం తెల్లారేసరికి నీటి నిల్వ 53 టీఎంసీల వరకు చేరనుంది. ఈ నెల మొదటి వారంలో కేవలం 27 టీఎంసీలు ఉండగా.. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదతో సీన్​ మారిపోయింది. ఎగువ నుంచి వరద ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,079 అడుగుల మేర నీరు ఉంది.

కాళేశ్వరం బ్యారేజీలు ఫుల్... 
ఎస్సారెస్పీ దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌ కూడా నిండుతోంది. దీని కెపాసిటీ 20.17 టీఎంసీలు కాగా.. కాళేశ్వరం ఎత్తిపోతలు, వర్షాల కారణంగా ఇప్పటికే 18.09 టీఎంసీలకు చేరింది. పైనుంచి 3,861 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన కడెం నుంచి రిలీజ్ అవుతున్న వాటర్ కూడా అందితే, గేట్లు ఎత్తే చాన్స్​ఉంది.  ఇక కాళేశ్వరంలో భాగమైన సుందిళ్లలో 8.8 టీఎంసీలకు గాను 6.46, అన్నారంలో10.87 టీఎంసీలకు గాను 7.29, మేడిగడ్డలో 16.17 టీఎంసీలకు గాను 12.2 టీఎంసీల నీళ్లున్నాయి. మేడిగడ్డ వద్ద ఎగువ నుంచి 63,740 క్యూసెక్కుల వరద​వస్తుండడంతో 24 గేట్లు ఎత్తి 44,730 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. 

నిండుకుండలా కడెం 
భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరితో పాటు, దాని ఉప నదులపై  అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఫుల్​అయింది. 700 అడుగులకు గాను 696 అడుగులు కొనసాగిస్తూ మంగళవారం రెండు గేట్ల ద్వారా11,994 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 4,760 క్యూసెక్కుల నీటిని రిలీజ్​చేస్తున్నారు. భైంసా మండలంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. 358 అడుగులకు గాను 357 అడుగుల వరకు చేరుకుంది. కరీంనగర్​లోని ఎల్ఎండీకి మోయతుమ్మెద వాగు నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో రిజర్వాయర్​ నిండుకుండలా మారింది. మొత్తం 24 టీఎంసీలకు గాను 21 టీఎంసీలతో కళకళలాడుతోంది. మోయతుమ్మెద వాగు నుంచి 1,793 క్యూసెక్కుల ఇన్ ఫ్లో  వస్తుండగా, కాకతీయ కెనాల్​ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా, 9.3 టీఎంసీలతో నిండుకుండలా మారింది. 627 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు నిండడంతో నాలుగు గేట్లు ఎత్తి 2,695 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.   

కృష్ణా ప్రాజెక్టులకు అంతంతే.. 
గోదావరికి భిన్నంగా ఎగువ నుంచి వరద లేక కృష్ణా ప్రాజెక్టులు నిండడం లేదు. కర్నాటకలోని ఆల్మట్టికి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అంతే నీటిని కిందికి వదులుతున్నారు. నారాయణపూర్‌కు 12 వేల క్యూసెక్కులు వస్తుండగా, 14 వేల క్యూసెక్కులు రిలీజ్​చేస్తున్నారు. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు 2 వేల క్యూసెక్కుల చొప్పున ఇన్‌ ఫ్లో వస్తోంది. శ్రీశైలానికి 250 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండగా, పవర్‌ హౌస్‌ ద్వారా కరెంట్‌ ఉత్పత్తి చేస్తూ 7 వేల క్యూసెక్కులకు పైగా నీటిని నదిలోకి వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో కరెంట్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. నాగార్జున సాగర్​కెపాసిటీ 312 టీఎంసీలు కాగా, కేవలం 167.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,436  క్యూసెక్కుల వరద వస్తోంది. 645 అడుగులకు గాను  641.20 అడుగులతో జలకళ సంతరించుకుంది. దీంతో  కుడి, ఎడమ కాలువల ద్వారా 203.58 క్యూసెక్కుల నీటిని పంటలకు రిలీజ్​చేస్తున్నారు.