కరోనా సెకండ్ వేవ్‌తో మళ్లీ వాయిదాపడుతున్న ఫంక్షన్లు

కరోనా సెకండ్ వేవ్‌తో మళ్లీ వాయిదాపడుతున్న ఫంక్షన్లు
  • ఫంక్షన్లు వాయిదా వేస్తున్నరు
  • కరోనా సెకండ్ ​వేవ్​ కారణంగా వేడుకలపై డైలమాలో సిటిజన్స్​
  • మ్యారేజెస్ లో 100, 150 మందికే పర్మిషన్ 
  • గ్రాండ్ గా చేసుకోలేక బుకింగ్స్ పెండింగ్​
  • కొందరు ఇంట్లోనే చేసుకునేందుకు ఇంట్రెస్ట్​ 
  • నష్టపోయామంటున్న ఈవెంట్​ మేనేజ్​మెంట్లు 


“ సికింద్రాబాద్ కి చెందిన స్వప్నకి గత ఫిబ్రవరిలో ఎంగేజ్​మెంట్​ అయ్యింది. పెట్టుడు లగ్గంలో భాగంగా మే నెలలో మ్యారేజ్ ని  పెద్దలు నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా సెకండ్​ వేవ్, సిటీలో పాజిటివ్ ​కేసులు పెరుగుతుండగా ఆమె ఫ్యామిలీ మెంబర్స్​ టెన్షన్ ​పడుతు న్నారు. షాపింగ్ చేసి, ఫంక్షన్ హాల్ , ఈవెంట్ మేనేజ్​మెంట్​కు అడ్వాన్స్ లు ఇచ్చాక పరిస్థితి మారిపోతే ఏంటని ఆందోళన చెందుతున్నారు.  కేసులు తగ్గితే అప్పటి పరిస్థితిని బట్టి ముహూర్తం, కార్డులు ప్రింట్ చేయడం, బంధువులను పిలవడం లాంటివి చేస్తామని చెబుతున్నారు.  సిటీలో మే నెలలో ముహుర్తాలు పెట్టుకున్న వారంతా ఇలాగే ఆలోచిస్తున్నారు.’’ 

హైదరాబాద్, వెలుగు: బర్త్​డే నుంచి మ్యారేజ్​ఫంక్షన్ల వరకు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్​పడింది. పాజిటివ్ కేసులు పెరుగుతుండగా ఎలా చేసుకోవాలనే డైలమాలో పడ్డారు. సిటీలో ఏ ఫంక్షన్ అయినా  గ్రాండ్ గా చేసుకుంటుంటారు. మే నెలలో పెళ్లిళ్లు ఉండడంతో చాలామంది ఇప్పుడే బుకింగ్స్ చేసుకోలేమని, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఈవెంట్ ఆర్గనైజర్లకు చెబుతున్నారు. కేసులు పెరుగుతున్న కారణంగా చాలాబుకింగ్స్ వాయిదా వేసుకున్నారని ఈవెంట్​ఆర్గనైజర్లు పేర్కొంటున్నారు. 
 

మళ్లీ కేసులు పెరుగుతుండగా..
ఏ ఫంక్షనైనా చుట్టాలందరినీ పిలిచి గ్రాండ్ గా చేసుకుంటారు. ఈవెంట్ మేనేజ్​మెంట్​కల్చర్ వచ్చాక ఇది చాలా ఎక్కువైంది. ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే చాలు అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్లి ఫంక్షన్​ పూర్తి చేసుకుంటారు. సిటీలో ఏ ఫంక్షన్ హాల్​చూసినా జనాలతో సందడిగా ఉంటుంది. మళ్లీ కరోనా కారణంగా ఏ ఫంక్షన్​ చేసుకోవాలన్నా జనాలు ఆచితూచి ఆలోచిస్తున్నారు. గతేడాది కరోనా, లాక్​డౌన్​కారణంగా చాలావరకు ఎంగేజ్​మెంట్లను ఆన్​లైన్​లో కుటుంబసభ్యుల సమక్షంలో నిర్వహించుకున్నారు. మ్యారేజ్​నైనా ఎలాంటి టెన్షన్ లేకుండా  సంతోషంగా చేసుకోవాలనే జంటలకు మళ్లీ సెకండ్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. దీంతో చాలామంది పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. జూన్ దాటితే నవంబర్ లోనే ముహుర్తాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నో ప్లాన్స్ అంటున్నారు. కొందరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మాత్రమే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 

బుకింగ్స్​లేక ఉపాధి కోల్పోయి..
సిటీలో 500 లకు పైగా ఈవెంట్ మేనేజ్​మెంట్​కంపెనీలు ఉన్నాయి.  మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి లైటింగ్, డెకరేషన్, క్యాటరింగ్, పెళ్లి పనులు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ వరకు అన్ని చేస్తుంటాయి. ఒక్కో కంపెనీలో 100 నుంచి 200 మంది వర్కర్స్  ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా ఈవెంట్ మేనేజ్​మెంట్​నిర్వాహకులు బుకింగ్స్​లేక ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కొంతమంది నుంచే ఆర్డర్లు వస్తున్నాయని, మిగతావి హోల్డ్ లోనే పెడుతున్నారని చెబుతున్నారు. 

ఏం చేయాలో తెలియట్లేదు
సర్కార్​ చెప్పిన గైడ్ లైన్స్ పాటిస్తూ ఫంక్షన్లు, పెళ్లిళ్లు ప్లాన్ చేస్తున్నాం. మ్యారేజ్ ని గ్రాండ్ గా చేసుకుంటారు.  లిమిటెడ్ మెంబర్స్ అనడంతో చాలామంది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే  ఈవెంట్స్ చేస్తున్నాం. అయినా చాలా స్ర్టిక్ట్​ రూల్స్​పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని మ్యారేజ్ ల కు సంబంధించి బుకింగ్స్ అయ్యాయి. మరికొందరు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఈ ఇయర్ ఎలా ఉంటుందో అర్థం కావడంలేదు. 
- అరుణ్ కుమార్,వెడ్డింగ్ ప్లానర్ 

ఇంట్లో వాళ్లతోనే ప్లాన్​ చేసుకున్నాం
మా పాప 2019 ఏప్రిల్ లో పుట్టింది. గతేడాది ఫస్ట్ బర్త్ డే గ్రాండ్ గా ప్లాన్ చేశాం. కరోనా, లాక్ డౌన్ ఉండగా రిస్క్ తీసుకోలేకపోయాం. ఈసారైనా చుట్టాలను పిలిచి మంచిగా చేద్దామనుకున్నాం. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లో వాళ్లతోనే ప్లాన్ చేసుకున్నాం 
-  లెహనా, మణికొండ