ఇరిగేషన్కు పైసల్ తగ్గినయ్.. నిరుడుతో పోలిస్తే రూ.758 కోట్లు తక్కువ

ఇరిగేషన్కు పైసల్ తగ్గినయ్.. నిరుడుతో పోలిస్తే రూ.758 కోట్లు తక్కువ
  • ఈ ఏడాది బడ్జెట్​లో  రూ.22,615 కోట్ల కేటాయింపులు
  • మైనర్​ ఇరిగేషన్​కు  రూ.2,054 కోట్లు
  • డిపార్ట్​మెంట్​కు తగ్గిన రుణభారం
  • నిరుడు రూ.9,958 కోట్లు.. ఇప్పుడు రూ.8,879 కోట్లు
  •  రుణాల రీస్ట్రక్చర్​తో డిపార్ట్​మెంట్​కు కొంత ఉపశమనం

హైదరాబాద్, వెలుగు: 
రాష్ట్ర బడ్జెట్​లో ఇరిగేషన్​ శాఖకు నిధుల కేటాయింపు తగ్గింది. గత బడ్జెట్​తో పోలిస్తే ఈ ఏడాది రూ.758 కోట్లు తగ్గించారు. నిరుడు బడ్జెట్​లో రూ.23,373 కోట్ల కేటాయింపులు చేయగా.. ఈ ఏడాది రూ.22,615 కోట్లు బడ్జెట్​లో ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్​లో కేటాయింపులు తగ్గించడంతో ఆ మేరకు బడ్జెట్​లో కోత పడింది. నిరుడు బడ్జెట్​లో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.2,685 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ ఏడాది ఆ ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోతలు పెట్టింది. కేవలం రూ.230.43 కోట్లే కేటాయించింది. అక్కడ మిగిలిన నిధులను ఇతర స్కీములకు ప్రభుత్వం అడ్జస్ట్​ చేసింది. 

అయితే, చెరువుల అభివృద్ధి, రిపేర్లు తదితర పనుల కోసం మైనర్​ ఇరిగేషన్​కు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆ మేరకు నిధులను పెంచింది. అందులో ప్రాజెక్ట్​ బ్యారేజీల పనులకు రూ.90.33 కోట్లు కేటాయించింది. కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల కోసం మరో రూ.134.53 కోట్లు ప్రతిపాదించింది. నిరుడు మైనర్​ ఇరిగేషన్​కు కేవలం రూ.1,313 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.2,054.44 కోట్లకు పెంచింది. వరదల నియంత్రణ, నివారణ కోసం మరో రూ.280 కోట్లు కేటాయించింది.

ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధులు..

ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యమిచ్చింది. నారాయణపేట కొడంగల్​ లిఫ్టుకు గతంతో పోలిస్తే కేటాయింపులు పెంచారు. ఆ ప్రాజెక్టుకు ఈ ఏడాది రూ.1,104 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్​రూ.849 కోట్లతో పోలిస్తే నిధులు రూ.250 కోట్ల మేర పెరిగాయి. పాలమూరు రంగారెడ్డికి రూ.వంద కోట్లు పెంచి.. రూ.1,800 కోట్లు ప్రతిపాదించింది ప్రభుత్వం. 

కల్వకుర్తికి రూ.800 కోట్లు, ఏఎమ్మార్పీ ఎస్​ఎల్​బీసీకి రూ.800 కోట్లు, డిండి లిఫ్ట్​ స్కీమ్​కు రూ.600 కోట్లు, దేవాదులకు రూ.485 కోట్లు, సీతారామ సీతమ్మసాగర్​ మల్టీపర్పస్​ ప్రాజెక్టుకు రూ.336 కోట్ల కేటాయింపులను ప్రతిపాదించింది. ఇక, కృష్ణా బోర్డుకు రూ.14 కోట్లు కేటాయించింది. కాగా, ఇరిగేషన్​ శాఖ బడ్జెట్​ గత నాలుగేండ్లుగా తగ్గుతూ వస్తున్నది. 2023=24లో రూ.29,766 కోట్లు కేటాయించగా.. 2024=25లో రూ.23,492 కోట్లు, 2025=26 బడ్జెట్​లో రూ.23,373 కోట్లు కేటాయించారు. ఈ నాలుగేండ్లలో ఇరిగేషన్​ శాఖ బడ్జెట్​లో రూ.7,151 కోట్లు తగ్గింది. 

తగ్గిన రుణభారం..

బడ్జెట్​లో ఈ ఏడాది రుణభారం స్వల్పంగా తగ్గింది. నిరుడు రూ.9,958.89 కోట్లు రుణాల కోసం కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.8,879.82 కోట్లుగా ఉంది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్​ కోసం తీసుకున్న రుణ చెల్లింపులే రూ.6,191.82 కోట్లుగా ఉంది. వాటర్​ రిసోర్సెస్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ కింద మరో రూ.2,688 కోట్లు (నిరుడు బడ్జెట్​లో రూ.2962.47 కోట్లు) రుణాల కోసం ప్రభుత్వం కేటాయించింది. 

నిరుడు కేటాయించిన రూ.6,996 కోట్లతో పోలిస్తే కాళేశ్వరం రుణాలకు చెల్లించాల్సిన మొత్తం రూ.804 కోట్లు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వం, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​చొరవ తీసుకుని కేంద్రంలో రుణాలను రీస్ట్రక్చర్​ చేయించడంతో రుణభారం కొంత తగ్గి ఉపశమనం లభించినట్టయింది. 

వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు..

 ప్రాజెక్ట్​                    మొత్తం (రూ.కోట్లలో)

చిన్న తరహా 
ఎత్తిపోతలు-(టీజీ ఐడీసీ)    500
శ్రీపాద ఎల్లంపల్లి     447
ఎర్రుపాలెం ఎన్​ఎస్​పీ 
లిఫ్ట్​ స్కీమ్​    370.99
ఎస్సారెస్పీ స్టేజ్​2    276.86
ఇందిరమ్మ 
వరద కాలువ     250
నెట్టెంపాడు     232.50
నాగార్జునసాగర్    196.85
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు     119.90
లోయర్ పెన్​గంగ    177
రాజీవ్ భీమా     119.22
మోడికుంటవాగు    90
జూరాల    88
నీల్వాయి ప్రాజెక్టు     81
నిజాంసాగర్    71
కోయిల్​సాగర్​    56
ప్రాణహిత- చేవెళ్ల     52
పెద్దవాగు    50