అన్నీ తామై.. అంత్యక్రియలు చేస్తున్న ముస్లీం యువకులు

అన్నీ తామై.. అంత్యక్రియలు చేస్తున్న ముస్లీం యువకులు

ఆసిఫాబాద్,వెలుగు: కరోనా టైం.. అమ్మో అంటూ భయపడుతున్న రోజులివి. కొందరు కుటుంబ సభ్యులు, బంధువులు తమవారిని పట్టించుకోవడంలేదు. దీంతో ముస్లిం యువకులు కొందరు మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నారు. కొవిడ్​తో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. అన్నీ తామై అండగా ఉంటున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన ముస్లిం యువకులు కొందరు 2015 లో ‘యూనిటీ యూత్’ పేరుతో సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం కరోనా విజృభించడంతో చాలామంది వైరస్​బారిన పడి చనిపోయారు. అయితే అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ముందుకు రాకపోవడంతో యూనిటీ సభ్యులు ముందుకు వస్తున్నారు. కుల , మతాలకు అతీతంగా సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వైరస్​ బారిన పడి మృతిచెందిన 22 మందికి దహన సంస్కరాలు చేశారు. గత ఏడాది కరోనా టైంలో పేదలకు ఉచితంగా భోజనాలు, నిత్యవసర సరుకులు అందజేశారు. సుమారు 12 వేల మంది నిరుపేదలకు రూ. 27 లక్షలు విలువచేసే వస్తువులు అందజేసినట్లు యూత్ సభ్యులు తెలిపారు. అంతేకాదు ఎవరికి రక్తం అవసరం ఉన్న దానం చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి బ్లడ్​ డోనేషన్​ క్యాంప్​ ఏర్పాటు చేస్తున్నారు. 

35 లగ్గాలు చేసిన్రు..

ఆర్దిక స్థోమత లేని నిరుపేదల పెళ్లిలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు 35 వివాహాలు జరిపించారు. భోజనాలు, ఫ్రిజ్, డ్రస్సింగ్​టేబుల్, వంట సామాన్లు అందిస్తున్నారు. పెళ్లికి ఎంత మంది వచ్చినా సొంత ఖర్చుతో భోజనాలు వడ్డిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి మూడేళ్ల క్రితం 40 మంది నిరుపేద మహిళలకు టైలరింగ్ లో  ఫ్రీ ట్రైనింగ్​ఇచ్చారు.

సేవ చేయడంలోనే తృప్తి

పేదరికం, ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవ చేయడం సంతృప్తినిస్తోంది. చిన్నప్పటి నుంచే సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. పది మంది కిలిసి యూనిటీ ఏర్పాటు చేశాం. పీపీఈ కిట్లు ధరించి కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం.
- వసీం అహ్మద్, యూనిటీ ప్రెసిడెంట్, కాగజ్ నగర్

ఫోన్ చేస్తే వాలిపోతాం...

ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా.. యూనిటీ మెంబర్స్​కు ఫోన్ చేస్తే తమవంతు సహాయ సహకారాలు అందిస్తాం. పోయినేడాది పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశాం. ఈసారి కరోనాతో చనిపోయిన 22 మందికి అంత్యక్రియలు నిర్వహించాం. ‌‌‌‌‌‌‌‌ - యాహియా (అహ్మద్) , యూనిటీ మెంబర్