10న ‘ఫ్యూచర్ సిటీ అథారిటీ’ భవనం ప్రారంభం... టెక్నాలజీని, ప్రకృతిని మేళవించి పర్యావరణహితంగా నిర్మాణం 

10న ‘ఫ్యూచర్ సిటీ అథారిటీ’ భవనం ప్రారంభం... టెక్నాలజీని, ప్రకృతిని మేళవించి పర్యావరణహితంగా నిర్మాణం 
  • సోలార్, బయోఫిలిక్ డిజైన్.. బయో డైవర్సిటీని రక్షించేలా ఏర్పాట్లు  
  • ఫ్యూచర్ సిటీకి గ్రీన్ సింబల్‌‌‌‌గా నిలువనున్న బిల్డింగ్

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్ అథారిటీ భవనం(ఎఫ్​సీడీఏ)ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల10వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఎఫ్​సీడీఏ భవన నిర్మాణంలో పర్యావరణహితమైన ‘సస్టైనబుల్ డిజైన్’ పద్ధతులను పాటించారు. భవనం పైకప్పు మీద ఫోటో వోల్టాయిక్ షేడ్స్ అమర్చారు. ఇవి సోలార్ పవర్‌‌‌‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, లోపల సహజమైన చల్లదనాన్ని అందిస్తాయి. 

గ్రీన్ రూఫ్ గార్డెన్స్, నీటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన ఎకో ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి రీచార్జీ చేసే విధానం, వ్యర్థ జలాలను శుద్ధి చేసి మొక్కలకు వినియోగించడంలాంటివి పర్యావరణ పరిరక్షణకు అద్దం పడుతున్నాయి. భవనం చుట్టూ ఉండే ల్యాండ్‌‌స్కేపింగ్‌‌లో దేశీయ మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూ బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు తీసుకున్నారు. ఎయిర్ క్వాలిటీ మెరుగుపరచడానికి బయోఫిలిక్ డిజైన్ ద్వారా లోపలి గదుల్లో కూడా పచ్చదనాన్ని నింపేలా ఏర్పాట్లు చేశారు. 

నిర్మాణంలో వాడుతున్న గాజు ఫ్యాకేడ్ కేవలం అందం కోసమే కాకుండా, వెలుతురు ఉండడంతోపాటు ఉష్ణోగ్రతను తగ్గించేలా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న కలెక్షన్ పాండ్ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మేలు జరిగేలా ప్లాన్ చేశారు. మొత్తానికి టెక్నాలజీని, ప్రకృతిని మేళవించి నిర్మిస్తున్న ఈ భవనం ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ సింబల్‌‌గా నిలువనున్నది.గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడులు, కీలక ఒప్పందాలన్నీ ఈ ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయం నుంచే జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

ప్రపంచస్థాయి సంస్థలు ఇక్కడికి వచ్చినప్పుడు మన నగరం వైభవం ప్రతిబింబించేలా ఈ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఎఫ్‌‌సీడీఏ భవనం ఫ్యూచర్ సిటీ విజన్ దిశగా తొలి అడుగులా నిలుస్తుంది. కేవలం కార్యాలయంగా మాత్రమే కాకుండా, ఇది ఒక నాలెడ్జ్ హబ్‌‌గా కూడా సేవలందించనుంది. ఐటీ, ఫార్మా, ఇతర రంగాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఇక్కడ ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ హాల్స్‌‌ కూడా సిద్ధం చేశారు.