తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలో రాజకీయ ప్రకంపనలే

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలో రాజకీయ ప్రకంపనలే

తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు బీజేపీదేనని,  రెండేళ్లలో ఎవరూ ఊహించని రాజకీయ పరిణామాలు చూస్తార‌‌ని కేంద్ర హోం శాఖ స‌‌హాయ మంత్రి జి.కిష‌‌న్ రెడ్డి అన్నారు.  భారీ రాజకీయ ప్రకంపనలు ఖాయమ‌‌ని చెప్పారు. వార‌‌స‌‌త్వ రాజ‌‌కీయాల‌‌తో విసిగిపోయిన ప్రజ‌‌లు త‌‌మ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నార‌‌న్నారు. తెలంగాణలో అంతా త‌‌న‌‌వ‌‌ల్లేనని గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్ ఎంపీగా త‌‌న కూతుర్ని గెలిపించుకోలేక‌‌పోయార‌‌ని ఎద్దేవా చేశారు. ఫెడ‌‌రల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశంలో గుణాత్మక‌‌మైన మార్పు తెస్తానన్న కేసీఆర్ అడ్రస్ గ‌‌ల్లంత‌‌వుతోంద‌‌న్నారు. ఆదివారం విజయవాడలో  బీజేపీ స‌‌భ్యత్వ న‌‌మోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తర్వాత సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేశారు. ” ఫ్రంట్ ఫ్రంట్ అంటూ దేశ‌‌మంతా తిరిగిన చంద్రబాబు టెంట్ ఊడిపోయింది. 40 ఏళ్ల రాజ‌‌కీయ అనుభ‌‌వం ఉన్న వ్యక్తి మోడీని ఓడించేందుకు అద్దె విమానాల్లో తిరిగారు. కాంగ్రెస్ తో జట్టు కట్టినందుకే ప్రజలు ఆయన్ను ఓడించారు. మోడీని ఇంటికి పంపిస్తానని బీరాలు ప‌‌లికిన చంద్రబాబు.. త‌‌న కొడుకుని మంగ‌‌ళ‌‌గిరిలో గెలిపించుకోలేకపోయార‌‌ు. చంద్రబాబు కొడుకు, కేసీఆర్ కూతురు ఓడిపోవ‌‌ట‌‌మే తెలుగు రాష్ర్టాల్లో బీజేపీకి భవిష్యత్తు ఉందనడానికి ఉదాహ‌‌ర‌‌ణ. ప్రజ‌‌లు మార్పు కోసం ఎదురు చూస్తున్నార‌‌ు. దేశవ్యాప్తంగా వ‌‌చ్చిన మార్పు మ‌‌న ద‌‌గ్గర రావ‌‌డానికి కొంత స‌‌మ‌‌యం ప‌‌డుతుంది” అని అన్నారు.

అభిమానులూ బీజేపీలో చేరండి: కృష్ణంరాజు

పార్టీ  ప్రెసిడెంట్ ఎవ‌‌రో చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంద‌‌ని కిషన్ రెడ్డి విమ‌‌ర్శించారు. ఎన్నిక‌‌ల తర్వాత కేడర్ కు ఆ  పార్టీ ప్రెసిడెంట్ కు సంబంధాలు పూర్తి తెగిపోయాయని, కాంగ్రెస్ కనుమ‌‌రుగ‌‌వుతోందనే ప‌‌లువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిపారు. 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అత్యధిక మెంబర్ షిప్ కలిగిన పార్టీగా బీజేపీ నిలించిందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీలో చేరాలని తన అభిమానులకు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు క‌‌న్నా ల‌‌క్ష్మీనారాయ‌‌ణ, ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి అడపా శివనాగేంద్ర రావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.