HCUలో 60 ల్యాప్ టాప్ లు ఎత్తుకెళ్లిన దొంగలు దొరికారు

HCUలో 60 ల్యాప్ టాప్ లు ఎత్తుకెళ్లిన దొంగలు దొరికారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాప్‌టాప్స్ చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు  చేధించారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిధిలోని సీఆర్  రావు  ఇన్​స్టిట్యూట్ క్లాస్​రూమ్​లో జరిగిన భారీ ల్యాప్‌టాప్ ల చోరీ కేసులో  ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి  నుంచి సుమారు 60 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.  కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ (30) తో పాటు, సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19) అనే ఇద్దరు విద్యార్థులు కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు. 

బయటి వ్యక్తులకు ప్రవేశం లేకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 8న రాత్రి దొంగతనం జరగడం సంచలనంగా మారింది. వర్సిటీలోని సీఆర్ రావు ఇన్​స్టిట్యూట్ క్లాస్​రూమ్​లోగుర్తు తెలియని దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడి 60 ల్యాప్​టాప్​లు ఎత్తుకెళ్లారు. ఫిబ్రవరి9 ఉదయం క్లాస్​రూమ్​లో ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు కనిపించకపోవడంతో వర్సిటీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ పోలీసులకు సమాచారం అందించింది.  

ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కిటికీ గ్రిల్స్ తొలగించబడినట్లు, సమీపంలో కారు టైర్ల గుర్తులు ఉన్నట్లు గమనించారు.  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు  చేశారు. యూనివర్సిటీ ప్రాంగణం ,సెక్యూరిటీ విధానాలపై అవగాహన ఉన్న నిందితులు, అర్ధరాత్రి సమయంలో లోపలికి ప్రవేశించి ల్యాప్‌టాప్‌ల చోరీ చేశారు. ​సిసిటివీ ఫుటేజ్ , సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందాలు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 ల్యాప్‌టాప్‌లతో పాటు, 3 సెల్ ఫోన్లు, చోరీకి ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు..