స్పీకర్​గా గడ్డం ప్రసాద్.. ఏకగ్రీవంగా ఎన్నిక

స్పీకర్​గా గడ్డం ప్రసాద్..  ఏకగ్రీవంగా ఎన్నిక
  • స్పీకర్​గా గడ్డం ప్రసాద్
  • ఏకగ్రీవంగా ఎన్నిక.. అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు 
  • గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు: రేవంత్ 
  • తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు: కేటీఆర్ 
  • బెస్ట్​ స్పీకర్​గా పేరు తెచ్చుకోవాలి: వివేక్​ వెంకటస్వామి
  • సభలో అందరికీ సమయమిస్తం: స్పీకర్ ప్రసాద్  
  • కొత్త స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తదితరులు కలిసి స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. 

ఆ తర్వాత సీఎం, మంత్రులు, సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్లి స్పీకర్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్‌‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా మద్దతు తెలిపినందుకు బీఆర్‌‌ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మంచి సంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ‘‘గడ్డం ప్రసాద్​ది మా జిల్లానే. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌‌కు ఎంతో విశిష్టత ఉంది. వికారాబాద్‌‌ గుట్ట వైద్యానికి పెట్టింది పేరు. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకుంటే, రోగాలు నయమవుతాయన్న పేరుంది. సమాజంలోని ఎన్నో రుగ్మతలకూ గడ్డం ప్రసాద్‌‌ అధ్యక్షతన నడిచే ఈ సభ పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నాను. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్‌‌ అయ్యారు. ఎంపీటీసీ నుంచి స్పీకర్‌‌ స్థాయికి ఎదిగారు. వికారాబాద్‌‌ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్‌‌ది చెరగని ముద్ర. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్‌‌కు బాగా తెలుసు. ఆయనకు ఎనిమిది మంది సోదరీమణులు ఉన్నారు. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో, వారందరి బాధ్యత ప్రసాదే తీసుకున్నారు. ఈ అసెంబ్లీ కూడా ఒక కుటుంబమే. ఆ కుటుంబంలో పాలక, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ సభ్యులే. అందరినీ సమన్వయం చేసే బాధ్యతను ప్రసాద్ సమర్థవంతంగా నిర్వహించగలరన్న, అందరి హక్కులను కాపాడగలరన్న నమ్మకం ఉంది. ఆయన కృషి ఫలితంగానే వికారాబాద్‌‌ కు మెడికల్‌‌ కాలేజీ వచ్చింది. అప్పా జంక్షన్‌‌ నుంచి వికారాబాద్‌‌ మన్నెగూడా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణకూ చొరవ చూపారు” అని అన్నారు.  

మాకే ఎక్కువ సమయమివ్వాలి: ప్రశాంత్ రెడ్డి

స్పీకర్‌‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌‌ బాబు అడగ్గానే, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌‌ ఆదేశించారని కేటీఆర్‌‌ తెలిపారు. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌‌రెడ్డిలాగే కొత్త స్పీకర్ కూడా సభా హక్కులను కాపాడాలని కోరారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ గడ్డం ప్రసాద్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తమకే ఎక్కువ సమయం కేటాయించాలని కొత్త స్పీకర్‌‌ను మాజీ మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి కోరారు. గతంలో తాము అలాగే ఇచ్చామన్నారు. కాగా, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌‌రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి, కాలె యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు స్పీకర్​కు అభినందనలు తెలిపారు.  

పార్టీల బలాలను బట్టి సమయం: స్పీకర్‌‌

స్పీకర్‌‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ.. తనను స్పీకర్‌‌గా ఎంపిక చేసినందుకు సీఎం రేవంత్‌‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఏకగీవ్రంగా ఎన్నుకున్నందుకు అన్ని పార్టీలకు కృతజ్ఞతలు చెప్పారు. సభలో అందరికీ సమయం ఇస్తామని, పార్టీల బలాలను బట్టి కేటాయిస్తానని పేర్కొన్నారు. స్పీకర్‌‌ పదవి ఉన్నతమైనదని, అదే సమయంలో సంక్లిష్టమైనదని అభిప్రాయపడ్డారు. సభ్యులందరూ సభా సంప్రదాయాలు కాపాడాలని, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.  

ప్రొటెం స్పీకర్‌‌ సమక్షంలో పలువురి ప్రమాణం.. 

గతంలో ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో సభ మొదలైన వెంటనే ప్రొటెం స్వీకర్‌‌ అక్బరుద్దీన్‌‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి, ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి, కేటీఆర్, పాడి కౌశిక్‌‌ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్‌‌ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. కేసీఆర్, బత్తుల లక్ష్మారెడ్డి వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి రాలేదు. మొత్తం 119 మంది సభ్యులకు గాను వీళ్లిద్దరు మినహా మిగిలిన వాళ్లందరూ ప్రమాణం చేశారు. 

స్పీకర్‌‌ సమక్షంలో బీజేపీ సభ్యుల ప్రమాణం.. 

ప్రొటెం స్పీకర్‌‌గా అక్బరుద్దీన్‌‌ ఒవైసీ నియామాకాన్ని వ్యతిరేకిస్తూ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు.. గురువారం అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్‌‌గా గడ్డం ప్రసాద్‌‌ కుమార్‌‌ ఎన్నిక కావడంతో ఆయన సమక్షంలోనే ప్రమాణం చేశారు. రాజాసింగ్‌‌, ఏలేటి మహేశ్వర్‌‌ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌‌బాబు, పాయల్‌‌ శంకర్‌‌, పవార్‌‌ రామారావు పాటిల్ ప్రమాణం చేశారు. రామారావు పాటిల్, రాజాసింగ్‌‌ హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణం చేసేటప్పుడు రాజాసింగ్ చెప్పులు విడిచారు.

రేవంత్ రెడ్డిని కలిసిన వివేక్ 

సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం అసెంబ్లీలో కలిశారు. అసెంబ్లీ సెషన్ కొనసాగుతుండగా సీఎం దగ్గరికి వెళ్లి, ఆయన పక్కన కూర్చొని మాట్లాడారు. ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంతో చర్చించారు. 

బెస్ట్ స్పీకర్​గా పేరు తెచ్చుకోవాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

స్పీకర్​గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్​కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందనలు తెలిపారు. ఆయన కష్టపడి పైకి వచ్చారని అన్నారు. ఇంతకుముందు చాలాసార్లు ప్రసాద్ కుమార్​ను కలిశానని తెలిపారు. తెలంగాణలో బెస్ట్ స్పీకర్​గా పేరు సంపాదించుకోవాలని వివేక్​ ఆకాంక్షించారు.

పేదల బాధలు తెలిసిన వ్యక్తి: భట్టి 

పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్‌‌ కుమార్‌‌ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని, చర్చలు అర్థవంతంగా జరిగేలా చూస్తారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. స్పీకర్ గా ప్రసాద్ కుమార్ శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారన్న నమ్మకం ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌‌ బాబు అన్నారు. స్పీకర్‌‌ ఏకగ్రీవానికి మద్దతు తెలిపినందుకు ప్రతిపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌‌ నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. తన తండ్రి శ్రీపాదరావు కూడా ఇదే శాసనసభలో స్పీకర్‌‌‌‌గా పని చేసి, ఆ పదవికి ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని అన్నారు.