ఉమ్మడి రంగారెడ్డికి నీళ్ల ప్రాజెక్టులు తెస్తం : గడ్డం ప్రసాద్ కుమార్

ఉమ్మడి రంగారెడ్డికి నీళ్ల ప్రాజెక్టులు తెస్తం : గడ్డం ప్రసాద్ కుమార్
  • పరిగిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి 
  • మన్నెగూడ – హైదరాబాద్హైవే పూర్తి చేస్తం 

పరిగి వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాణహిత – చేవెళ్ల, రంగారెడ్డి – -పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి సాగు, తాగు నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సోమవారం పరిగి నియోజకవర్గంలో  స్పీకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. పాంబండ . ఆలయం దర్శించి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంట్లో మీడియాతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడారు.

పరిగిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వంద రోజుల్లో ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అందే విధంగా చూస్తామని తెలిపారు. మన్నెగూడ – హైదరాబాద్ వరకు హైవే ను నిర్మిస్తామని, జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు చంద్రయ్య, సిద్ధాంతి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.