- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను అడిగి తెలుసుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్చించారు. సుమారు రూ. 4 వేల కోట్ల అంచనా పెట్టుబడితో ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్ ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతి, తదుపరి చర్యలపై ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేశ్ షెట్కార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజలకు అవసరమైన రైల్వే సౌకర్యాలపై పలు కీలక అంశాలను మంత్రితో చర్చించారు. సత్వరమే తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పన, రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు.
రామగుండం–మణుగూరు కీలకం
రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల పారిశ్రామిక, వాణిజ్య, రవాణా అభివృద్ధికి రామగుండం–మణుగూరు రైల్వే లైన్ ఎంతో కీలకమని కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ వంశీకృష్ణ తీసుకెళ్లారు. అందువల్ల యుద్ధప్రాతిపాదికన ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, త్వరితగతిన క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ)ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఇందుకు సంబంధించిన నిధుల విడుదల, పనుల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత రెండేండ్లుగా ఈ అంశాలపై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనుల్లో ఆలస్యం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, ఈ విషయంలో చొరవచూపాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ అంశంపైనా రైల్వే శాఖ అధికారులతో ఎంపీ వంశీకృష్ణ చర్చించారు. కాగా.. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానకూలంగా స్పందించారని తెలిపారు.
రైల్వే అభివృద్ధి కోసం ఫాలోఅప్
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ మీడియాకు వెల్లడించారు. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా నిరంతరం కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం చేస్తూ ఫాలోఅప్ చేస్తున్నట్టు చెప్పారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్ నుంచి ఆర్వోబీలు, ఎఫ్‌ఓబీలు, రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ల వరకు.. పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగంగా జరిగేలా శక్తివంచన లేకుండా ఫోకస్ చేస్తున్నట్టు తెలిపారు.
