- దళితుడిని ఉన్నత స్థానంలో చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది: గడ్డం వినోద్
హైదరాబాద్, వెలుగు: దళిత వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. దళితుడు ఉన్నత స్థానంలో ఉండటాన్ని బీఆర్ఎస్ ఓర్వలేక ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అన్నీ కలిసి 86 శాతం ఉన్నాయని గుర్తుచేశారు. 4 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభకు అధిపతి అయిన స్పీకర్‌పై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనన్నారు.
ఇలాంటి ఘటనలు ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. స్పీకర్‌ను ఉద్దేశించి తాతా మధు చేసిన వ్యాఖ్యలు అసహ్యకరంగా, అసభ్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఒక మాజీ సీఎం ఫామ్‌హౌస్ కేంద్రంగా ఉండి ఇలాంటి వారికి అండగా నిలుస్తూ, రెచ్చగొట్టేలా ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. సభాపతికి జరిగిన అవమానం కేవలం వ్యక్తిగతం కాదని, అది సభ మొత్తానికి, రాజ్యాంగ వ్యవస్థకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా కట్టడి చేసేలా సభలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
