రామచంద్రాపురం, వెలుగు: ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో సమాజ విలువలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, కర్మాగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలకు అధ్యాత్మిక ఆనందాన్ని పంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని నందిగామలో గురువారం జరిగిన శ్రీ మహా చండీ సహిత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి మంత్రి హాజరయ్యారు.
మంత్రికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు చేసి, పూజారుల నుంచి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కల్యాణాన్ని ఘనంగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ ఎల్లగోని విక్రమ్‌గౌడ్‌ను మంత్రి అభినందించారు. అనంతరం మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ లీడర్లు గజమాలతో సత్కరించారు.
