
మెదక్/తూప్రాన్, వెలుగు: గద్దర్ మరణ వార్త తెలిసి ఆయన సొంతూరు మెదక్ జిల్లాలోని తూప్రాన్ తల్లడిల్లుతున్నది. ప్రజా ఉద్యమాలకు గొంతుకైన తన బిడ్డ ఇక లేడని తెలిసి కంటతడి పెడుతున్నది. పుట్టిన ఊరుకు మంచి పేరు తేవడంతో పాటు తన ఊరి రైతులకు సాగు నీటి బాధలు తీర్చాలని లిఫ్టు స్కీమ్ మంజూరు చేయించిన గద్దర్‌ను తలచుకుని తూప్రాన్ ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. గద్దర్‌కు తూప్రాన్ లో సొంతిల్లు ఉంది. ఇక్కడి పాత ఇల్లు కూలిపోగా, కొన్నేండ్ల కింద కొత్తది నిర్మించారు. అప్పుడప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వెళ్తుండేవారు. మెదక్ తదితర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు.
నాటకాలు, బుర్రకథలపై ఆసక్తి..
గద్దర్ తూప్రాన్‌లోనే హెచ్ఎస్సీ వరకు చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి ఉండేది. ప్రధానంగా నాటకాలు వేసేవారు. గద్దర్ బుడ్డర్ ఖాన్ వేషం కడ్తే తిరుగుండేది కాదంటారు. అప్పట్లోనే దోస్తులతో కలిసి ఒక బుర్రకథా బృందాన్ని గద్దర్ఏర్పాటు చేశారు. ఆ బృందంతో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో బుర్ర కథలు చెప్తుండేవారట. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివే రోజుల్లో విప్లవోద్యమాల వైపు ఆకర్షితులయ్యారు.
సొంతూరికి సాగునీళ్లు..
సొంతూరి కోసం ఏదైనా చేయాలని భావించిన గద్దర్.. కిష్టాపూర్ చెక్ డ్యామ్ నుంచి లిఫ్ట్ స్కీమ్ ద్వారా తూప్రాన్ పెద్ద చెరువు నింపి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని అనుకున్నారు. 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి లిఫ్ట్ స్కీమ్ మంజూరు చేయించారు. అప్పుడే రాష్ట్ర విభజన జరగడంతో ఫండ్స్ రాలేదు. తెలంగాణ వచ్చాక ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్ సర్కార్ రూ.3.50 కోట్లు మంజూరు చేసింది. దీన్ని త్వరగా పూర్తి చేసేందుకు గద్దర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 2016లో ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి కాగా, తర్వాతి ఏడాది నుంచే పెద్ద చెరువులోకి నీళ్లు వచ్చేలా చేసి, సాగుకు ఇబ్బందులు లేకుండా చేశారు.
వచ్చినప్పుడల్లా కలిసేటోడు..
గద్దర్.. నా చిన్నప్పటి దోస్తు. మేము ఇద్దరం తూప్రాన్ బడిలో చదువుకున్నం. నేను మధ్యలోనే చదువు మానేసిన. అతను పెద్ద చదువులు చదివేటందుకు పట్నం పోయిండు. తూప్రాన్ వచ్చినప్పుడల్లా నన్ను కలిసేటోడు. నేను, పసుల కిష్టయ్య, మోహన్ రెడ్డి, గద్దర్ కలిసి మాట్లాడుకునేటోళ్లం. ఇప్పుడు గద్దర్ లేడని తెలిసి మనుసు కలుక్కుమంది.
‑ జంగం గోవిందు, తూప్రాన్
చిన్నప్పటి నుంచే పాటలు పాడేటోడు..
గద్దర్ తూప్రాన్ సర్కార్ బడిలో చదువుకున్నడు. నేను లెక్కలు, ఇంగ్లిష్ పాఠాలు చెప్పిన. చదువులో హుషార్‌గా ఉండే గద్దర్.. చిన్నప్పటి నుంచే పాటలు పాడేటోడు. ఒగ్గు కథలు, బుర్ర కథలపై ఆసక్తి చూపేటోడు. నా భార్య దగ్గర సంగీతంలో పాఠాలు నేర్చుకున్నడు. తూప్రాన్ వచ్చినప్పుడల్లా నన్ను కలిసేవాడు. గద్దర్ చనిపోయిండంటే బాధగా ఉంది.
‑ కిష్టయ్య, గద్దర్‌కు చదువు చెప్పిన టీచర్