నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోండి : గద్వాల్ విజయలక్ష్మి

నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోండి : గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: సిటీలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. సోమవారం బల్దియా హెడ్డాఫీసులో అడిషనల్ కమిషనర్(హెల్త్) స్నేహ శబరీశ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లు సర్కిళ్లలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై రెగ్యులర్​గా  తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి, ప్రమాణాలు పాటించని వాటిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా కల్తీ ఫుడ్ పైనా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లు ఈవీడీఎం విభాగం సహకారంతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి స్టాఫ్ తక్కువగా ఉన్నారని అధికారులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమీక్షలో అధికారులు బాలాజీ, నరసింహారెడ్డి, సుదర్శన్ రెడ్డి, కార్పొరేటర్లు సీవీ రెడ్డి, శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి, బన్నాల గీత, పద్మా వెంకట్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఇన్​స్పెక్టర్లు  పాల్గొన్నారు.