- ఇటీవల ఎస్పీ నేతృత్వంలో పలు స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
- పేకాట దందా వెనుక పోలీస్ ఆఫీసర్ల హస్తం ఉన్నట్లు గుర్తింపు
- మిర్యాలగూడ డీఎస్పీపైబదిలీ వేటు
- మరో ఇద్దరు ఎస్సైల పైనా చర్యలకు రంగం సిద్ధం
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో పోలీస్అధికారుల మెడకు పేకాట ఉచ్చు బిగుస్తోంది. నాగార్జునసాగర్ కేంద్రంగా నడుస్తున్న పేకాట దందాలో పోలీస్ఆఫీసర్ల హస్తమున్నట్లు తేలడం కలకలం రేపుతోంది. స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగి టాస్క్‌ఫోర్స్‌తో దాడులు చేయించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ క్రమంలో ఇప్పటికే మిర్యాలగూడ డీఎస్పీపై బదిలీ వేటు పడగా ఒకటి, రెండు రోజుల్లో ఇద్దరు ఎస్సైల పైనా చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో డీజీపీ కూడా సీరియస్ అయినట్లు సమాచారం.
ఈ దందాలో పోలీసుల పాత్రపై నిఘా వర్గాలు సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాయి. కొంతకాలంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం పేకాటకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉండటం, పర్యాటక ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతం జూదగాళ్లకు అనుకూలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సాగర్ పరిధిలోని కొన్ని హోటళ్లు, తోటలు, ఇళ్లు, ఫామ్‌హౌస్‌లను కేంద్రాలుగా చేసుకుని విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నట్లు ప్రచారం ఉంది.
తనిఖీలకు వస్తే పక్క రాష్ట్రానికి తప్పించుకునేలా..
కొంతమంది అధికార పార్టీ నేతల అండదండలతో నిర్వాహకులు నిర్భయంగా వ్యవహరిస్తుండటంతో పోలీసులు పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పేకాటరాయుళ్లు మరింత రెచ్చిపోయి పెద్ద ఎత్తున పేకాట కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దాడులకు వస్తే సరిహద్దు రాష్ట్రాల్లోకి తప్పించుకునే అవకాశం ఉండటంతో నాగార్జునసాగర్ పేకాటరాయుళ్లకు సేఫ్ జోన్‌గా మారిందని అంటున్నారు.
ఇదివరకు శని, ఆదివారాలు లేదా సెలవు దినాలకు పరిమితమైన ఈ వ్యవహారం ప్రస్తుతం ప్రతి రోజు కొనసాగుతోంది. వ్యక్తుల స్థాయి, డబ్బు బలం బట్టి హోటళ్లు, ఇళ్లు, తోటలు, ఫామ్‌హౌస్‌లలో అన్ని సౌకర్యాలతో పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారి నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
పోలీసు సిబ్బందిపై నిఘా?
పెద్ద ఎత్తున పేకాట దందా సాగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నతాధికారులు జిల్లా పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. పేకాటరాయుళ్లకు సహకరిస్తున్న ఖాకీల జాబితాపై కూడా నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజుపై బదిలీ వేటు పడింది. నాగార్జునసాగర్, పెద్దవూర ప్రాంతాలకు చెందిన మరికొందరు ఎస్సైలపై కూడా వేటు పడే అవకాశముంది.
ఇదిలా ఉండగా టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించి పేకాట స్థావరాలపై భారీగా దాడులు చేపడుతున్నారు. పేకాట ఆడేవారు, నిర్వహించేవారు, ప్రోత్సహించేవారు సహా సుమారు 40 మందిని గుర్తించి అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైడ్లు కొనసాగుతుండటంతో జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో దొంగలను రక్షించేందుకు నియోజకవర్గానికి చెందిన ఓ ఎస్సై చేసిన అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. ఆయనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పేకాట వ్యవహారంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజును రెండు రోజుల కింద సీబీఐ విభాగానికి డీఎస్పీగా బదిలీ చేశారు.

