డేంజర్​గా గాంధీ క్యాంటిన్​  

డేంజర్​గా గాంధీ క్యాంటిన్​  
  • ఆస్పత్రి సెల్లార్​లో ఉండగా నెలకొన్న భయాందోళన
  • డ్రైనేజీ మురుగంతా వెళ్తుండగా భరించలేని వాసన
  • స్టేఫీ కాదని ఇప్పటికే హెచ్చరించిన నిపుణులు
  • ఏండ్ల తరబడిగా కొలిక్కిరాని కొత్త బిల్డింగ్​

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలోని డైట్ క్యాంటిన్​తో ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన నెలకొని ఉంది. ఆస్పత్రి సెల్లార్​లో  డైట్​ క్యాంటిన్​ ఉండగా, గాలి, వెలుతురు చాలా తక్కువగా వస్తుంది. వంట గదులు, సామగ్రి స్టోర్ ​రూమ్​లో బొద్దింకలు, ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగతో సిబ్బందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.  ఆస్పత్రిలోని డ్రైనేజీ  మురుగంతా క్యాంటీన్​లోకి వస్తుండగా భరించలేని కంపు కొడుతోంది. గ్యాస్​ సిలిండర్లు 20 నుంచి 30 వరకు నిల్వ చేసి ఉంచుతుండగా,  ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకైతే ఫైర్​ యాక్సిడెంట్​జరిగే చాన్స్​ఎక్కువగా ఉంది. రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వెంటనే గాంధీ ఆసుపత్రిలో ప్రతిపాదిత స్థలంలో  సొంత భవనాన్ని నిర్మించి, సెల్లార్​ లోని క్యాంటిన్​ను వెంటనే తరలించాలని ఆస్పత్రి   స్టాఫ్​, పేషెంట్లు  కోరుతున్నారు.
 

బిల్డింగ్​కు సీఎస్​ఆర్ ​నిధులు 
ఇటీవల కొన్ని కంపెనీలు సీఎస్​ఆర్​ ( కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ ) కింద డైట్​ క్యాంటిన్​ బిల్డింగ్​ నిర్మించడానికి ఆస్పత్రి అధికారులను సంప్రదించినట్టు తెలిసింది. ముఖ్యంగా మింట్​కాంపౌండ్​( కేంద్ర ప్రభుత్వ టంకశాల) అధికారులు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. అయితే సంస్థ సొంతంగా లేదా రెండు, మూడు కంపెనీలతో కలిసి నిధులు సమకూర్చుకుంటుందా అనేది తెలియదని ఆస్పత్రి నోడల్ ​అధికారి డా. ప్రభాకర్​రెడ్డి తెలిపారు.  

ప్రతిపాదనలకే పరిమితం 
ఆస్పత్రి సెల్లార్​లో డైట్​క్యాంటీన్​నిర్వహణ సేఫ్టీ కాదని తేల్చి నిపుణులు హెచ్చరిస్తూ నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.  అనుకోని ఘటన జరిగితే  ఎవరు బాధ్యులనేది పెద్ద ప్రశ్న. గతంలో పలుమార్లు జరిగిన హాస్పిటల్​డెవలప్​మెంట్​సొసైటీ  (హెచ్​డీఎస్​) సమావేశాల్లో కొత్త డైట్​క్యాంటీన్​బిల్డింగ్​ప్రస్తావన వచ్చినా ప్రతిపాదనలకే పరిమితమైంది. భవన నిర్మాణానికి రూ. కోటి 20 లక్షలు ఖర్చవుతయని టీఎస్ఎంఎస్​ ఐడీసీ ( తెలంగాణ స్టేట్​మెడికల్​సర్వీసెస్​ అండ్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్​కార్పొరేషన్​) అధికారులు అంచనాలు కూడా రూపొందించారు. క్యాంటిన్ భవన నిర్మాణానికి ఓపీ బిల్డింగ్​వెనక ( ప్రస్తుతం నిర్మిస్తున్న ఎంసీహెచ్​బిల్డింగ్​ పక్కన ) ఖాళీ జాగా సిద్ధంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్​ ప్రొ.రాజారావు  తెలిపారు.